Siddipet Collector : సిద్దిపేట బిడ్డ ఆర్యన్ రోషన్ ఐఐటీలో చేరుతాడిక..!
ప్రధానాంశాలు:
సెమిస్టర్ ఫీజుతోపాటు ల్యాప్ టాప్ అందించిన కలెక్టర్
పేదింటి పిల్లల చదువులకు ప్రజాప్రభుత్వం చేయూత
Siddipet Collector : చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా, కూలీ పనులు చేసే తల్లి అండతో, సోషల్ వేల్ఫేర్ విద్యా సంస్థల్లో చేరి, చదువుల్లో రాణించి దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించిన సిద్దిపేట జిల్లా బిడ్డ ఆర్యన్ రోషన్ కు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది.సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన బి.ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివాడు. పదవ తరగతిలో 10/10 జీపీ, ఇంటర్ లో 93.69 మార్కులు తెచ్చుకొని, జేఈఈ ర్యాంకు ద్వారా తిరుపతి ఐఐటీలో సీటు సాధించాడు.
పేదరికం కారణంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆర్యన్ రోషన్ గురించి వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా యంత్రాంగం స్పందించింది. జిల్లా కలెక్టర్ మను చౌదరి గారు శుక్రవారం నాడు ఆ విద్యార్దిని కలెక్టరేట్ కార్యాలయానికి పిలిపించారు. ఐఐటీ తిరుపతిలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో సీటు పొందిన ఆర్యన్ రోషన్ కు సెమిస్టర్ ఫీజు నిమిత్తం రూ.36,750 చెక్కును అందజేశారు.
అలాగే చదవు అవసరాల నిమిత్తం రూ. 40,500 విలువైన ల్యాప్ టాప్ ను కూడా కొనిచ్చారు. భవిష్యత్తులోనూ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని, ఐఐటీలోనూ రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థి ఆర్యన్ రోషన్ కు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, ఇతర అధికారులు కూడా ఉన్నారు.