Telangana Bhoobharati Portal Launch : రైతుల కష్టాలకు చెక్.. ధరణి స్థానంలో ఏప్రిల్ 2 నుంచి ‘ఇంటిగ్రేటెడ్ భూభారతి’.. ఆ 5 మండలాల్లోనే పైలట్ ప్రాజెక్ట్!

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: March 27, 2026, 1:00 pm

Telangana Bhoobharati Portal Launch : తెలంగాణలో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులు, సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘ధరణి’ పోర్టల్.. పాత సమస్యలను తీర్చకపోగా కొత్త చిక్కుముడులను తెచ్చిపెట్టిందన్న విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు.. ధరణి స్థానంలో సరికొత్తగా ‘ఇంటిగ్రేటెడ్ భూభారతి’ Integrated Bhoobharati పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ పోర్టల్ సేవలను పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

Telangana Bhoobharati Portal Launch : రైతుల కష్టాలకు చెక్.. ధరణి స్థానంలో ఏప్రిల్ 2 నుంచి 'ఇంటిగ్రేటెడ్ భూభారతి'.. ఆ 5 మండలాల్లోనే పైలట్ ప్రాజెక్ట్!

Telangana Bhoobharati Portal Launch : రైతుల కష్టాలకు చెక్.. ధరణి స్థానంలో ఏప్రిల్ 2 నుంచి ‘ఇంటిగ్రేటెడ్ భూభారతి’.. ఆ 5 మండలాల్లోనే పైలట్ ప్రాజెక్ట్!

Telangana Bhoobharati Portal Launch సచివాలయంలో మంత్రి పొంగులేటి కీలక సమీక్ష

భూభారతి పోర్టల్ రూపకల్పన దాదాపు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అలాగే ఎన్ఐసీ NIC అధికారులతో మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా.. రైతులకు అత్యంత పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ పోర్టల్‌ను డిజైన్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

Telangana Bhoobharati Portal Launch పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన 5 మండలాలు ఇవే

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కాకుండా, ముందుగా ప్రయోగాత్మకంగా 5 జిల్లాల్లోని 5 మండలాలను పైలట్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది.

నారాయణపేట జిల్లా: కోస్గి మండలం

రంగారెడ్డి జిల్లా: అమన్‌గల్‌ మండలం

సంగారెడ్డి జిల్లా: వట్‌పల్లి మండలం

ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట మండలం

ఏప్రిల్ 2 నుంచి ఈ ఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, మెరిట్స్, డీమెరిట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు చేసిన తర్వాత.. రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీనిని అమలు చేయనున్నారు.

ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ప్రత్యేకతలు

1. అన్నీ ఒకే గొడుగు కిందకు

ధరణిలో ఉన్న అతిపెద్ద లోపం సమన్వయ లోపం. దీన్ని అధిగమించేందుకు భూభారతిలో రెవెన్యూ, సర్వే, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు. దీనివల్ల భూ లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు పారదర్శకంగా కనిపిస్తాయి.

2. మనుషులకు ఆధార్.. భూములకు ‘భూదార్’

ఈ పోర్టల్ తెస్తున్న అతిపెద్ద మార్పు ఇదే. మనుషులకు ఆధార్ కార్డు నెంబర్ ఎలాగో, ఇకపై ప్రతి ఒక్క సర్వే నెంబర్‌కు ఒక ‘భూదార్ నెంబర్’ను కేటాయిస్తారు.

3. లాగిన్ విధానం చాలా ఈజీ

రైతులు తమ ఆధార్ నెంబరుతో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా భూభారతి పోర్టల్‌లో సులభంగా లాగిన్ అయ్యి తమ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను పొందవచ్చు. రిజిస్ట్రేషన్‌ లేదా ఇతర భూసేవల‌ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్పటి నుంచి ప్ర‌క్రియ పూర్త‌య్యే వ‌ర‌కు ప్ర‌తి దశలోనూ ఎస్ఎంఎస్ (SMS) ద్వారా దరఖాస్తుదారుడికి అలర్ట్స్ వెళతాయి.

4. సర్వే మ్యాప్ తప్పనిసరి

భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలోనే సర్వే మ్యాప్‌ను జతచేయడాన్ని ఈ 5 పైలట్ మండలాల్లో కచ్చితంగా అమలు చేయనున్నారు.

5. 36 మాడ్యూల్స్ ఇక ఒకే చోట

ధరణి పోర్టల్‌లో వినియోగదారులను గందరగోళానికి గురిచేసే 36 మాడ్యూల్స్ ఉండేవి. భూభారతి పోర్టల్‌లో వాటన్నింటినీ సులభతరం చేస్తూ ఒకే ఛాప్ట‌ర్ కిందకు తీసుకువచ్చారు.

6. సిటిజన్ డాష్ బోర్డు సేవలు

ఈ పోర్ట‌ల్‌లో ప్రధానంగా సమాచార, సర్వే, కరెక్షన్, అప్పీల్, రిజిస్ట్రేషన్ సేవలతో పాటు.. పౌరుల కోసం ప్రత్యేక డాష్ బోర్డు ఉంటుంది. ఇందులో మైల్యాండ్ పోర్ట్‌ఫోలియో, నాలా ఆర్డ‌ర్స్‌, డాక్యుమెంట్ వివ‌రాలు, ఆర్వోఆర్‌, భూధార్ నెంబ‌ర్‌, మ్యూటేష‌న్ స్టేటస్, ఈసీ (EC), మార్కెట్ విలువ‌, విలేజ్ మ్యాప్‌, గ్రామాల న‌క్షా, పాస్ బుక్ క‌రెక్ష‌న్ వంటి సకల సేవలు అందుబాటులో ఉంటాయి.

మొత్తం మీద, భూవివాదాల్లేని తెలంగాణను నిర్మించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న ఈ ‘భూభారతి’ అడుగు సత్ఫలితాలను ఇస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ఏప్రిల్ 2న ప్రారంభమయ్యే ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికినట్లే.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp