Gunde Ninda Gudi Gantalu Today Episode : రోహిణి ప్లాన్‌కు మనోజ్ విలవిల.. సుమతి పెళ్లిపై బాలు సంచలన నిర్ణయం!

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: November 23, 2026, 10:00 am

Gunde Ninda Gudi Gantalu November 23 Episode 827 : గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో నవంబర్ 23 ఎపిసోడ్ ఆసక్తికరమైన మలుపులతో సాగింది. ఒకవైపు రోహిణి తన భర్త మనోజ్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తుంటే, మరోవైపు సుమతి పెళ్లి విషయంలో బాలు, మీనా మధ్య దూరం మరింత పెరిగింది. బిచ్చగాడు చెప్పిన మాటలతో మనోజ్‌లో భయం మొదలవగా, సుమతి కోసం భర్తను ఒప్పించే ప్రయత్నంలో మీనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీతూ ఉదయాన్నే ఇంటికి వచ్చి రవి, శృతిలకు క్షమాపణలు చెప్పింది. తమ కంపెనీలో బిజినెస్ పార్ట్‌నర్‌గా చేరాలని రవిని కోరింది. మధ్యలో మనోజ్ తనను భాగస్వామిగా తీసుకోవాలని అడగడంతో నీతూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మేడపై రవితో మాట్లాడిన శృతి ఈ అవకాశాన్ని వదులుకోవద్దని నచ్చచెప్పింది. మొదట నిరాకరించిన రవి చివరకు అంగీకరించాడు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే నీతూ అతనితో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకుంది. నీతూ కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలని తెలుసుకున్న ప్రభావతి, ఆమెను మనోజ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. కొడుకు గురించి గొప్పలు చెప్పింది. కానీ తనకు పెళ్లిపై ఆసక్తి లేదని, దేశవ్యాప్తంగా రెస్టారెంట్ బ్రాంచ్‌లను వందకు పైగా విస్తరించడమే లక్ష్యమని నీతూ చెప్పింది. రవికి పెళ్లి కాకపోయి ఉంటే అతడినే పెళ్లి చేసుకునేదానినని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Gunde Ninda Gudi Gantalu Today Episode : రోహిణి ప్లాన్‌కు మనోజ్ విలవిల.. సుమతి పెళ్లిపై బాలు సంచలన నిర్ణయం!

Gunde Ninda Gudi Gantalu Today Episode : రోహిణి ప్లాన్‌కు మనోజ్ విలవిల.. సుమతి పెళ్లిపై బాలు సంచలన నిర్ణయం!

బిచ్చగాడి మాటలతో మనోజ్‌కు జ్ఞానోదయం.. రోహిణి కొత్త ప్లాన్!

రోహిణి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోందని మనోజ్ అనుమానపడుతుండటంతో అతడి స్నేహితుడు సలహా ఇచ్చాడు. భార్యను ప్రేమగా చూసుకోకుండా ఆమె ఎవరితో మాట్లాడినా ఎందుకు బాధపడుతున్నావని ప్రశ్నించాడు. రోహిణితో మాట్లాడిన మహేశ్ అనే వ్యక్తి నంబర్ తీసుకొచ్చి మనోజ్‌తో మాట్లాడించాడు. వాళ్లిద్దరూ పాత స్నేహితులై ఉండొచ్చని, గత విషయాలు గుర్తుచేసుకుంటూ మాట్లాడుకుంటున్నారేమోనని చెప్పాడు. భార్యతో ప్రేమగా ఉండటమే సమస్యకు పరిష్కారమని సూచించాడు. ఇంట్లో ప్రేమ దొరక్కపోతే మనుషులు బయట వెతుక్కుంటారని హెచ్చరించాడు. ఇంతలో దుకాణం దగ్గరకు ఓ బిచ్చగాడు వచ్చాడు. కాళ్లూ చేతులూ బాగానే ఉన్నప్పుడు అడుక్కోవాల్సిన అవసరమేంటని మనోజ్ అడిగాడు. దానికి అతడు చెప్పిన సమాధానం మనోజ్‌ను ఆలోచనలో పడేసింది. శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదని, మనశ్శాంతి కూడా కావాలన్నాడు. భార్యను ప్రేమగా చూసుకోకపోవడంతో ఆమె తన డబ్బు, ఆస్తి తీసుకుని వెళ్లిపోయిందని, చివరకు అడుక్కోవాల్సి వచ్చిందని చెప్పాడు.ఆ మాటలు విన్న మనోజ్ షాకయ్యాడు. ఇది దేవుడు ఇచ్చిన హెచ్చరిక కావచ్చని, ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే నీ పరిస్థితి కూడా అలాగే మారుతుందని స్నేహితుడు భయపెట్టాడు.

రోహిణి ఫోన్ కాల్‌తో మనోజ్‌లో మరింత అనుమానం

మరోవైపు రోహిణి తన స్నేహితురాలితో మాట్లాడుతూ మనోజ్‌ను మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని వివరించింది. అతడు తల్లికి ఇచ్చే ప్రాధాన్యం తగ్గి భార్యను ప్రేమగా చూసుకోవాలనేది తన ఉద్దేశమని చెప్పింది . మనోజ్ తనకు ఫోన్ చేశాడని స్నేహితురాలు చెప్పడంతో రోహిణి ఆశ్చర్యపోయింది. అయితే మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడని తెలుసుకుని సంతోషించింది. అప్పుడే మనోజ్ వస్తుండటంతో రోహిణి మహేశ్‌తో మాట్లాడుతున్నట్లు నటించింది. ఎవరితో మాట్లాడుతున్నావని అతడు ప్రశ్నించగా, మహేశ్ తన కాలేజీ స్నేహితుడని చెప్పింది. తనతో మాట్లాడితే సమయమే తెలియదని, తన గొంతులో ఏదో మ్యాజిక్ ఉందని మహేశ్ అంటుంటాడని చెప్పడంతో మనోజ్ అసూయతో రగిలిపోయాడు.

సుమతి పెళ్లి కోసం మీనా పోరాటం.. అత్తింటిని మరిచిపోవాలన్న బాలు!

ఇక సుమతి పెళ్లి విషయంలో మీనా పుట్టింట్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అక్క జీవితం పాడవుతోందని శివ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక కూతురి పెళ్లి కోసం మరో కూతురి కాపురం చెడిపోవడం సరైనదేనా అని పార్వతమ్మ కూడా బాధపడింది. బాలుతో మాట్లాడాలని శివ కోరాడు. అయితే అరుణ్ మంచివాడు కాదని బాలు చెప్పిన విషయాన్ని పార్వతమ్మ గుర్తుచేసింది. అల్లుడి అభిప్రాయాన్ని కాదని పెళ్లి చేస్తే పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన చెందింది. అక్కడికి వచ్చిన మీనా, సుమతి భోజనం చేయడం లేదని తెలుసుకుంది. అరుణ్‌తో పెళ్లి గురించి మాట్లాడావా అని అడిగింది. అందరికీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని తాను సంతోషంగా ఉండలేనని సుమతి కన్నీళ్లతో చెప్పింది. తన కారణంగా అక్కాబావల మధ్య గొడవలు రావడం ఇష్టం లేదంది. బాలు అంగీకారం లేకుండా ఏమీ చేయలేనని, అతడు మంచి సంబంధమే తీసుకొస్తాడని పార్వతమ్మ చెప్పి వెళ్లిపోయింది. భోజనం మానేసి తనను తాను శిక్షించుకోవద్దని మీనా సుమతిని ఓదార్చింది. తన కోసం ప్రేమను వదులుకోవాలనుకోవద్దని చెప్పింది.

అరుణ్ తల్లి వేడుకోలు.. కన్నీళ్లు పెట్టుకున్న సుమతి

ఇంతలో అరుణ్ తల్లి అక్కడికి వచ్చింది. తన కొడుకు సుమతిని ఎంతగా ప్రేమిస్తున్నాడో వివరించింది. బాలు, అరుణ్ మధ్య అభిప్రాయ భేదాలు ఇటీవల వచ్చినవని, కానీ సుమతిపై అరుణ్ ప్రేమ ఎప్పటి నుంచో ఉందని చెప్పింది. సుమతిని చూసినప్పుడు కొడుకు కళ్లలో కనిపించే ఆనందాన్ని చూసి అతడి ప్రేమను అర్థం చేసుకున్నానంది. తనకు కూతురు ఉంటే ఎలా చూసుకునేదో సుమతి కూడా అలాగే చూసుకుంటుందని, అలాంటి కోడలు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఎంత వెతికినా సుమతి లాంటి అమ్మాయి దొరకదని, తన కొడుకు ఆనందం కోసం బాలును ఒప్పించే బాధ్యత తీసుకోవాలని మీనాను వేడుకుంది. ఇద్దరి సంతోషం నీ చేతుల్లోనే ఉందని చెప్పడంతో సుమతి కన్నీళ్లు పెట్టుకుంది.

బాలును ప్రశ్నించిన మీనా.. బంధం తెంచుకుంటానంటూ హెచ్చరిక

ఇంటికి వెళ్లిన మీనా సుమతి పెళ్లి గురించి బాలుతో మాట్లాడింది. అరుణ్ ఎలాంటి వ్యక్తో తనకు తెలుసని, భవిష్యత్తులో సుమతి కష్టపడుతుందని భావిస్తున్నానని బాలు చెప్పాడు. అయితే తండ్రి స్థానంలో బాలును గౌరవించడం వల్లే సుమతి అతడి నిర్ణయానికి కట్టుబడి ఉందని మీనా గుర్తుచేసింది. అరుణ్ తన అహాన్ని పక్కనపెట్టి క్షమాపణ అడిగితే అంగీకరిస్తారా అని ప్రశ్నించింది. ఇన్నాళ్లూ కోపంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా క్షమాపణ అడిగితే నమ్మలేనని బాలు చెప్పాడు. అతడి అనుమతి లేకుండా సుమతి, అరుణ్‌ల పెళ్లి చేస్తే ఏం చేస్తారని మీనా అడగడంతో బాలు ఆగ్రహించాడు. తన మాట కాదని ఆ పెళ్లి జరిపిస్తే మీనా పుట్టింటితో సంబంధాలు కొనసాగించలేదని హెచ్చరించాడు. పుట్టింటికే ప్రాధాన్యం ఇస్తే అత్తింటిని శాశ్వతంగా మరిచిపోవాల్సి వస్తుందని తేల్చిచెప్పాడు. సుమతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని బాలు చెప్పినా, ఒకవేళ తాను అతడి నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సి వస్తే ఏమిటని మీనా ప్రశ్నించింది. దీంతో బాలు కోపంగా వెళ్లిపోయాడు.

Also Read :  Bigg Boss Telugu 10 : వంశీ మాటలకు తలదించుకుంటున్నా నాగార్జున..!

రోహిణిని వెంబడించిన మనోజ్.. బేకరీ దగ్గర మరో ట్విస్ట్!

తర్వాతి ఉదయం రోహిణి అందంగా తయారవుతుండటంతో మనోజ్ అనుమానం మరింత పెరిగింది. ఎక్కడికి వెళ్తున్నావని అడగగా, తన బెస్ట్ ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్తున్నానని చెప్పింది. మనోజ్ ఎంత వారించినా వినకుండా రోహిణి బయటకు వెళ్లిపోయింది. దీంతో ఆమె ఎవరిని కలుస్తుందో తెలుసుకోవాలని మనోజ్ రహస్యంగా వెంబడించాడు. రోహిణి ఓ బేకరీలోకి వెళ్లి కేక్ తీసుకుని బయటకు వచ్చింది. అసలు ఆమె ఎవరిని కలవబోతోంది? మనోజ్ అనుమానం ఎలా తొలగుతుంది? అనే ఆసక్తితో నవంబర్ 23వ తేదీ 827వ ఎపిసోడ్ ముగిసింది.

No liveblog updates yet.

LIVE UPDATES

Ramalingaiah Tandu

Author Bio Info : Ramalingaiah Tandu is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp