Rice price : ప్రజలకు గుడ్ న్యూస్.. ఆధార్ ఉంటే చాలు..తక్కువ ధరకే బియ్యం.. ఎక్కడ దొరుకుతుంది? ఎలా కొనాలి? వివరాలివే..
Rice price : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బజార్లు, రైస్‌మిల్ ఔట్‌లెట్లలో నాణ్యమైన బీపీటీ బియ్యాన్ని రూ.52కే అందిస్తోంది. రేషన్ కార్డు అవసరం లేదు. ఆధార్ బయోమెట్రిక్‌తో ఒక్క కుటుంబానికి 10 కిలోల వరకు కొనుగోలు అవకాశం. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Rice price : ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మార్కెట్‌లో బియ్యం ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందించే ప్రత్యేక విక్రయ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి అందుబాటు ధరలో ఉత్తమ నాణ్యత గల బియ్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైతు బజార్లు, రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లు, మినీ మార్ట్ కేంద్రాల్లో బియ్యం కొనుగోలు చేసేందుకు రేషన్ కార్డు తప్పనిసరి కాదని మంత్రి స్పష్టం చేశారు. వినియోగదారులు ఆధార్ కార్డు ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేస్తే సరిపోతుందని తెలిపారు. ప్రతి వ్యక్తి లేదా కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
Rice price : ప్రజలకు గుడ్ న్యూస్.. ఆధార్ ఉంటే చాలు..తక్కువ ధరకే బియ్యం.. ఎక్కడ దొరుకుతుంది? ఎలా కొనాలి? వివరాలివే..
Rice price : మార్కెట్ ధరలతో పోలిస్తే భారీ తగ్గింపు.. ప్రజలకు ఊరట
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని ప్రభుత్వ ప్రత్యేక కేంద్రాల ద్వారా అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నామని చెప్పారు. మార్కెట్‌లో ఇటీవల బియ్యం ధరలు కిలోకు సుమారు రూ.10 వరకు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం వారికి ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ప్రస్తుతం మార్కెట్‌లో బీపీటీ స్టీమ్ రైస్ ధర కిలోకు రూ.64 నుంచి రూ.65 వరకు ఉండగా, ప్రభుత్వ ప్రత్యేక విక్రయ కేంద్రాల్లో అదే బియ్యాన్ని కేవలం రూ.52కే అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే బీపీటీ పచ్చి బియ్యం మార్కెట్‌లో రూ.58 నుంచి రూ.60 వరకు విక్రయమవుతుండగా, ప్రభుత్వ కేంద్రాల్లో దానిని రూ.50కే అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. దీంతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్‌మిల్ ఔట్‌లెట్ల ద్వారా బియ్యం విక్రయాలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ప్రజలు సమీపంలోని ప్రత్యేక కేంద్రాలకు వెళ్లి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణతో సులభంగా బియ్యం కొనుగోలు చేయవచ్చని తెలిపారు.
Rice price : రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు చెక్.. త్వరలో మరిన్ని నిత్యావసర వస్తువులు
ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం వెనుక మరో ముఖ్యమైన లక్ష్యం రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను పూర్తిగా అరికట్టడమేనని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మినీ మార్ట్‌ల వ్యవస్థ ద్వారా బియ్యం విక్రయాలను పారదర్శకంగా నిర్వహించడం వల్ల అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను గణనీయంగా నియంత్రించగలిగామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరల్లో అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తెలిపారు. ఇటీవల ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ రైతు బజార్‌లో కూడా ఈ ప్రత్యేక విక్రయ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడికి వచ్చిన వినియోగదారులతో మాట్లాడి ప్రభుత్వ చర్యలపై వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు కేవలం బియ్యం మాత్రమే కాకుండా త్వరలో కందిపప్పు, పామాయిల్‌తో పాటు ఇతర నిత్యావసర వస్తువులను కూడా అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడం, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు తక్కువ ధరల్లో అందించడం, అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని నిత్యావసర వస్తువులను కూడా ఇదే విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ధరల నియంత్రణతో పాటు కుటుంబాల ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు.







