AP Congress : ఈసారి కష్టమేగానీ.. 2029 అయినా కాంగ్రెస్ ఆశ నెరవేరుతుందా..?
ప్రధానాంశాలు:
AP Congress : ఈసారి కష్టమేగానీ.. 2029 అయినా కాంగ్రెస్ ఆశ నెరవేరుతుందా..?
AP Congress : కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో బలం పెంచుకోవాలని చూస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారింది. ఒకప్పుడు 30% కంటే అధిక ఓట్లతో బలంగా ఉండే ఆ పార్టీ కిందకు పడిపోయింది. ఏక సంఖ్య కూడా దాటడం లేదు. అయితే పక్కన ఉన్న కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేసుకుంది. దీంతో ఏపీ లోను కాంగ్రెస్ పార్టీ బలంగా మారాలని వై.యస్.షర్మిల కు పీసీసీ పగ్గాలు అందించేందుకు కసరత్తు చేస్తుంది. ఏపీ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చాలని వై.యస్.షర్మిల భావిస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేయాలని భావిస్తున్నారు. ఇక జగన్ వైసీపీ అభ్యర్థులను మారుస్తూ సంచలనాలకు కారణం అవుతున్నారు. ఇప్పటివరకు మూడు జాబితాలను ప్రకటించారు. 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు. వీరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి లాంటి కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.
కొలుసు పార్థసారథి సైతం పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని వంశీ జనసేన లో చేరుతానని ప్రకటించారు. అటు టీడీపీ జనసేన కూటమి ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ కూడా కూటమిలోకి వస్తుందని అంతా భావిస్తున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు బీజేపీకి కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా 25 మందితో జాబితాను ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోను సైతం విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కూటమి అభ్యర్థుల ప్రకటన వచ్చిన తర్వాత చాలా రకాల మార్పులు జరిగే అవకాశం ఉంది. కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వైసీపీలోని అసంతృప్త నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వచ్చారు. వారంతా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖాయం.
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా ఉనికి చాటుకునే అవకాశాలు ఉన్నాయి. 2029 లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏపీలో క్రియాశీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. అందుకే భవిష్యత్తును వెతుక్కుంటున్న చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీ టచ్ లోకి వస్తున్నారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీల గెలుపు ఓటములు కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపనున్నాయి. ఒకవేళ వైసీపీ ఓడిపోతే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు అంతా కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నా వీలైనంతవరకూ ఎక్కువ స్థానాలు దక్కించుకున్నా, అదే సమయంలో వైసీపీ ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి దశ మారినట్లే అవుతుంది. వైసీపీ నుంచి నేతలు కాంగ్రెస్ లో చేరడానికి క్యూ కడతారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. 2029 ఎన్నికల్లో విజయానికి చేరువయ్యేందుకు ఇప్పటినుంచి మార్గాన్ని సుగమం చేసుకునే అవకాశం ఉంది.