Minister Karumuri : మంత్రి కారుమూరి నేరుగా రంగంలోకి దిగాడు.. వాలంటీర్లకి కొండంత అండగా..!
Minister Karumuri : ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అంటే వాలంటీర్ల వివాదమే. అవును.. ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు వాలంటీర్ల వివాదం ముదురుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ వాలంటీర్ల వ్యవస్థపై తీవ్రస్థాయలో దుమ్మెత్తిపోస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ముసుగులో జగన్ సర్కార్ మహిళలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొంటున్నారన్నారు. వాళ్ల వ్యక్తిగత డేటాతో జగన్ సర్కార్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక.. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా వైసీపీపై నేరుగా ఎదురుదాడికి దిగుతున్నారు. తణుకు వారాహి యాత్రలో వాలంటీర్లను ఏకంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. దీనిపై వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. నిజంగానే పవన్ కళ్యాణ్ వాలంటీర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే నేను ఉరేసుకుంటా.. అని వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. దీంతో ఈ వివాదం ఇంకాస్త ముదిరింది. ఒక్క వాలంటీర్ ను అయినా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే కనుక తణుకు నరేంద్ర సెంటర్ లోనే ఉరేసుకుంటానని మంత్రి కారుమూరి హెచ్చరించారు.
Minister Karumuri : వాలంటీర్లు ఒక్క తప్పు చేసినట్లు నిరూపించినా ఉరేసుకుంటా
వాలంటీర్లు ఒక్క తప్పు చేసినట్టు నిరూపించినా ఉరేసుకుంటా.. అంటూ కారుమూరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏం రాసిస్తే అదే చదువుతాడు. ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ నే పవన్ కళ్యాణ్ చదువుతున్నారు.. అంటూ కారుమూరి వ్యాఖ్యానించడంతో.. ఆయన వ్యాఖ్యలపై జనసేన కూడా స్పందించింది. వాలంటీర్ల వ్యవస్థకు అసలు చట్టబద్ధత ఉందా? 6 కోట్ల మంది సమాచారాన్ని ఎందుకు జగన్ తీసుకున్నారు.. అంటూ మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జనసేన నేత మహేశ్. మేము సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం. మంత్రి ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.. అని ఆయన సవాల్ విసిరారు.