AR Constable Rammohan Reddy : ప్రేమ జంటలే లక్ష్యంగా కానిస్టేబుల్ కంత్రి పనులు.. యువతి బలి
ప్రధానాంశాలు:
AR Constable Rammohan Reddy : ప్రేమ జంటలే లక్ష్యంగా కానిస్టేబుల్ కంత్రి పనులు.. యువతి బలి
AR Constable Rammohan Reddy : ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఆర్మ్‌డ్ విభాగంలో అతడో ఏఆర్ కానిస్టేబుల్. ప్రేమ జంట కనిపిస్తే చాలు.. వారి ఫొటోలు తీసి, భయపెట్టి అందినకాడికి దోచుకోవడం అతడి నైజం. చివరికి అతడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో సదరు కానిస్టేబుల్‌ను రాజంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులుఅతడిని విధుల నుంచి తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప ఆర్మ్‌డ్ విభాగంలో కె. రామ్మోహన్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తన సమీప బంధువైన ప్రొద్దుటూరుకు చెందిన అనిల్ కుమార్‌రెడ్డిని పాలకొండల్లో తనకు సహాయకుడిగా నియమించుకున్నాడు. పాలకొండలకు వచ్చే ఒంటరి మహిళలు, ప్రేమ జంటల ఫొటోలు తీయడం అనిల్ కుమార్ పని. అలాగే భయపెట్టి వారి ఫోన్ నంబర్లు కూడా తీసుకుంటాడు.
అలా అతడు వారి నుంచి సేకరించిన వివరాలను రామ్మోహన్ రెడ్డికి పంపిస్తాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ పాలకొండలకు వచ్చి వాళ్ల తల్లిదండ్రులకు చెబుతానని భయపెట్టి, అందినకాడికి డబ్బులు వసూలు చేస్తాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ బీటెక్ విద్యార్థిని, ఆమె స్నేహితులు పాలకొండలకు వెళ్లారు. వెంటనే అనిల్ వారి ఫొటోలు తీయగా, రామ్మోహన్ రెడ్డి వెళ్లి బెదిరించాడు.
దాంతో విద్యార్థులు రూ.4 వేలు ఇచ్చి అక్కడి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత మళ్లీ బెదిరింపులకు దిగడంతో మరో రూ.10వేలు ఇచ్చారు. ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయినా అతడి బుద్ధి మారలేదు. యువతి తండ్రికి ఫోన్ చేసి బెదిరించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. యువతి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు రామ్మోహన్‌రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు అతడు పలువురిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో కానిస్టేబుల్ రామ్మోహన్‌రెడ్డిని కడప జిల్లా పోలీస్ అధికారి అశోక్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.