Nara Bhuvaneshwari : చంద్రబాబు నాయుడు కు రెస్ట్.. కుప్పం నుంచి నేను పోటీ చేస్తా.. నారా భువనేశ్వరి..!
ప్రధానాంశాలు:
Nara Bhuvaneshwari : చంద్రబాబు నాయుడు కు రెస్ట్.. కుప్పం నుంచి పోటీగా నారా భువనేశ్వరి..!
Nara Bhuvaneshwari : ఏపీలో ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. పొత్తుల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వరుసగా ఏడుసార్లు గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఆయన భార్య నారా భువనేశ్వరి కుప్పం వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబు నాయుడుకు కుప్పంలో విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. కుప్పంలో రెండు కుటుంబాలను ఆమె పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరపున ఆర్థిక సహాయం చేశారు.
ఈ సమయంలోనే స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మనసులో ఒక కోరిక కలిగిందని చెప్పుకొచ్చారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు కుప్పంలో ఈసారి రెస్ట్ ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఆమె వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే స్థానిక నేతలు హర్ష వ్యక్తం చేశారు. కుప్పంలో వరుసగా ఏడుసార్లు చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. ఈసారి కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ భారీ కసరత్తు చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు కుప్పంలో ఈసారి కూడా తన గెలుపు ఖాయమని ధీమాతో ఉన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు. స్థానిక క్యాడర్ తో మమేకం అవుతున్నారు. ఈసారి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అయితే నారా భువనేశ్వరి ని విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలంటూ కొందరు నేతలు చంద్రబాబు వద్ద ఇప్పటికే ప్రతిపాదించారు. కానీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం సంక్లిష్టంగా మారింది. చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్య, భరత్ పోటీ ఉన్న సమయంలో మరొకరిని దింపటం పైన చంద్రబాబు నాయుడు సుముఖంగా లేరని చెబుతున్నారు. అయితే ఇప్పుడు కుప్పం నుంచి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలతో ఆయన ఆలోచన మారిందా. కుప్పం నుంచి భువనేశ్వరి పోటీ చేయడం ఖాయమైందా అనే చర్చ మొదలైంది. కుప్పం వేదికగా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.