Mlc Elections In Ap : ఏపీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో వీరే గెలిచే అవకాశం ఉందంటున్న విశ్లేషకులు
ప్రధానాంశాలు:
Mlc Elections In Ap : ఏపీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో వీరే గెలిచే అవకాశం ఉందంటున్న విశ్లేషకులు
Mlc Elections In Ap : ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. రెండు గ్రాడ్యుయేట్, మరియు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్లు సీలు చేయబడ్డాయి. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టబడుతుంది. సాయంత్రం 4 గంటల నాటికి తూర్పు-పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో 63.28 శాతం పోలింగ్ నమోదైందని, కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో 65.58 శాతం, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గంలో 91.82 శాతం పోలింగ్ నమోదైందని ప్రధాన ఎన్నికల అధికారి నివేదించారు.
అయితే హోరా హోరీగా సాగిన ఈ పోరులో గెలుపు ఎవరినేది ఆసక్తికరంగా మారింది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి అభ్యర్థులు పోటీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు టిడిపి కూటమి మద్దతు తెలిపింది. కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పిడిఎఫ్ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టు టిడిపి అభ్యర్థులతో పోటీ పడ్డారు.
టీడీపీ అభ్యర్థులకే చాన్స్
రెండు పట్టబద్రుల ఎన్నికలకు సంబంధించి టిడిపి అభ్యర్థులు బరిలో ఉన్నారు. కృష్ణా- గుంటూరు పట్టభద్రుల స్థానానికి సంబంధించి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర పోటీ చేశారు. ఈయన బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. పైగా ఆయన సామాజిక వర్గానికి రెండు జిల్లాల్లో మంచి పట్టు ఉంది. పిడిఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మణరావు గట్టి పోటీ ఇచ్చినా అధికార పార్టీ ఎదుట నిలువ లేకపోయారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూ టమి అభ్యర్థి స్పష్టమైన గెలుపు దిశగా పయనిస్తున్నారని ఆ మూడు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. అక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో దిగలేదు. టిడిపి నుంచి పేరాభత్తుల రాజశేఖర్ బరిలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిడిఎఫ్ అభ్యర్థికి మద్దతు తెలిపినా ఫలితం లేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఆస్థానం సైతం కూటమి కైవసం చేసుకుంటుందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.
మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి గట్టిగానే పోటీ జరిగింది. ఇక్కడ ఏపీటీఎఫ్ వర్సెస్ పిఆర్టియు వర్సెస్ యుటిఎఫ్ అన్నట్టు పరిస్థితి మారింది . అయితే టిడిపి కూ టమి అనూహ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతు తెలిపింది. దీంతో ఆయన గెలుపు తథ్యంగా మారింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో టిడిపి కూటమి బలమైన శక్తిగా ఉంది. ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు తెలపడంతో టిడిపి ఏకతాటి పైకి వచ్చింది. జనసేన తో పాటు బిజెపి మద్దతు తీసుకుంది. అందుకే ఆ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటును టిడిపి కూటమి కైవసం చేసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.