Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

 Authored By suma | The Telugu News | Updated on :27 January 2026,2:28 pm

ప్రధానాంశాలు:

  •  Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం రూ.400 అప్పు విషయమై ఓ వృద్ధుడి ప్రాణాలు బలిగొన్న అమానుష ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. రామభద్రపురం మండలం పాతరేగ గ్రామానికి చెందిన యాసర్ల సింహాచలం (వృద్ధుడు) అదే గ్రామానికి చెందిన పెద్దింటి తిరుపతికి కొంతకాలం క్రితం రూ.400 అప్పుగా ఇచ్చాడు. రోజులు గడిచినా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో సింహాచలం పలుమార్లు అడిగినా స్పందన లేకపోయింది. చివరకు తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని గట్టిగా నిలదీశాడు. ఇదే తిరుపతిలో కోపాన్ని రగిలించింది. డబ్బు వివాదం కాస్తా ప్రాణాంతక దాడిగా మారడం గ్రామస్తులను కలచివేసింది.

Vizianagaram tragic incident

Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

Vizianagaram: వేడుకున్నా కరుణ లేకుండా దాడి

అప్పు గురించి ప్రశ్నించడాన్ని అవమానంగా భావించిన తిరుపతి సింహాచలంపై దాడికి దిగాడు. మాటల వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో చేతులు చేసుకున్నాడు. తోసివేయడంతో సింహాచలం సమీపంలో ఉన్న కుళాయి వద్ద దిమ్మపై పడిపోయాడు. అయినా అక్కడితో ఆగని తిరుపతి నేలపై పడిపోయిన వృద్ధుడిపై పిడిగుద్దులు గుద్ది కిరాతకంగా కొట్టాడు. “నన్ను వదిలిపెట్టు బాబు” అంటూ సింహాచలం వేడుకున్నా కనికరం చూపకుండా హింసించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో సింహాచలం తలకు, శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం ఎక్కువగా జరిగి పరిస్థితి విషమించింది. దాడి అనంతరం తిరుపతి అక్కడి నుంచి పరారయ్యాడు.

Vizianagaram: విషాదంలో గ్రామం..న్యాయం కోసం కుటుంబం ఎదురుచూపులు

తీవ్రంగా గాయపడిన సింహాచలం ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేక ఇంటి వద్దే ఉండిపోయాడు. సరైన వైద్యం అందకపోవడంతో రక్తస్రావం అధికమై అదే రాత్రి ప్రాణాలు విడిచాడు. మరుసటి రోజు తెల్లవారుజామున మంచంపై మృతదేహంగా కనిపించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఉపాధి నిమిత్తం గతంలో తాడేపల్లిగూడెంకు వెళ్లి పని చేసిన సింహాచలం ఇటీవలే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. భార్య అప్పయ్యమ్మతో కలిసి జీవనం సాగిస్తున్న ఆయనకు పిల్లలు లేరు. ఏకైక తోడైన భర్త మృతితో అప్పయ్యమ్మ గుండెలవిసిలేలా విలపిస్తోంది. సింహాచలం మృతి వార్తతో పాతరేగ గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని త్వరగా అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చిన్న అప్పు కారణంగా ఒక వృద్ధుడి ప్రాణం పోవడం సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. మానవత్వం, కరుణ వంటి విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

 

 

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది