ఏ లింగాన్ని పూజిస్తే ఏ ఫలితం ఉంటుందో తెలుసా?
ఒక్కొక్క లింగాన్ని పూజించి అభిషేకం చేయడం వల్ల, ఒక్కొక్క ఫలితం ఉంటుందని లింగ పురాణం చెబుతోంది. రత్న మయమైన లింగం సంపదలను ఇస్తుంది. రాతితో చేసిన లింగం సర్వ సిద్ధులను ఇస్తుంది. ధాతువుల నుంచి, అంటే పాదరసం వంటి వాటితోతయారైన లింగం ధనం ఇస్తుంది. కొయ్యతో తయారు చేసిన లింగం సర్వ భోగాలను కలిగిస్తుంది. మట్టితో చేసిన లింగం, అంటే పార్థివ లింగం అణిమాది సిద్ధులను ఇస్తుంది. శివ లింగాలన్నింటిలో రాతి లింగం అభిషేకానికి పూజకు ఉత్తమమైనదనీ, ధాతు లింగం మధ్యమ మైనదనీ, లింగ పురాణం చెబుతోంది. అలాగే మరిన్ని లింగాలను పూజించడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- గంధ లింగము.. రెండు భాగాలు కస్తూరి, నాలుగు భాగాలు చంద నము మూడు భాగాలుగా కలిపి గంధ లింగమును తయారు చేస్తారు. దీనికి పూజ చేసిన శివ సాయుజ్యం కలుగుతుంది.
- పుష్ప లింగము.. దీనిని అన్ని రకాల పూలతో నిర్మిస్తారు. ఈ విధంగా నానా విధాలైన సువాసనలు గల పూలతో నిర్మించిన పుష్ప లింగాన్ని పూజించినచో రాజ్యాధిపత్యము కలుగును.
- గోమయ లింగము.. స్వచ్ఛమైన కపిల గోమయమును తెచ్చి లింగమును నేలపైన మట్టిలోనపడిన పేడపనికి రాదు.
- రజోమయ లింగము.. పుప్పొడితో తయారు చేసిన లింగం వల్ల విద్యా ధరత్వము సిద్ధించును. ఆపైన శివ సాయుజ్యము పొందవచ్చును.
- యవ గోధుమ, శాలిజ లింగము.. దీనిని యవ, గోధుమలు, తండుల పిష్టముచేత తయారు చేస్తారు. దీనికి పూజ చేసినచో సకల సంపదలు కలుగును. పుత్ర సంతానం కలుగును.
- తిలపిష్ట లింగము: దీనిని నువ్వుల పిండితో తయారు చేస్తారు. దీనిని పూజించి నచో ఇష్టసిద్ధి కలుగును.
- లవణ లింగము.. దీనిని హరి దళము, త్రికటుకాలు మెత్తగా పొడిచేసి ఉప్పుతో కలిపి లింగముగా చేస్తారు. దీనిని పూజించిన వశీకరణ ఏర్పడును.
- తపోత లింగము : దీనిని పూజించిన శత్రువులు నశింతురు.
- భస్మమయ లింగము : దీనిని పూజించిన సమస్త ఫలితాలు చేకూరును.
- గుదోత లింగము : దీనికి పూజచేసిన ప్రీతిని కలిగించును.
- శర్కరామయ లింగము : దీనికి పూజచేసిన అన్నిసుఖాలు కలుగజేయును.
- దూర్వా కాండ లింగము : దీనిని గరిక కాడలతో చేస్తారు. దీనిని పూజించిన అపమృత్యువు నశించును.