Vishnu Manchu : మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి గైర్హాజరు.. మోహన్ బాబుపై కోపంతోనే?
Vishnu Manchu : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎలక్షన్స్ గతంలో ఎప్పుడు జరగని విధంగా జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా జరిగాయని సినీ ప్రముఖులతో పాటు పలువురు ఆర్టిస్టులు చెప్పారు. ఇకపోతే మా అధ్యక్ష పదవికి విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు పోటీ పడగా, విష్ణు నెగ్గాడు.మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు శనివారం ఉదయం 11.45 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కవాలని కోరుతూ ఇటీవల మోహన్ బాబు, మంచు విష్ణు పలువురిని కలిసి ఆహ్వానం అందించారు. పరుచూరి బ్రదర్స్, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, నందమూరి నటసింహం బాలకృష్ణతో పాటు పలువురిని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మీడియా వారు ఎవరెవరికి ఆహ్వానం ఇస్తున్నట్లు మంచు విష్ణును అడగగా, అందరికీ ఆహ్వానం పంపుతున్నట్లు విష్ణు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆహ్వానిస్తున్నట్లు విష్ణు తెలిపారు. అయితే, శనివారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కనిపించలేదు. ఇంతకీ మెగాస్టార్ చిరుకు ఆహ్వానం అందిందా అనే ప్రశ్న ఈ సందర్భంలో తలెత్తుతోంది. ఒక వేళ ఆహ్వానం అందినప్పటికీ షూటింగ్ బిజీలో చిరంజీవి రాలేకపోయారా? అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఇకపోతే మోహన్ బాబు, మంచు విష్ణు ఇంటికి వెళ్లి మరి ఆహ్వానించినప్పటికీ నందమూరి బాలకృష్ణ సైతం ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ కింగ్ మోహన్‌బాబు తప్ప సినీ ప్రముఖులు, పెద్దలు ఎవరు కనబడలేదు. మా ఎలక్షన్స్‌కు ముందర విష్ణు రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణను కలిశారు. వారు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు.
Vishnu Manchu : సినీ పెద్దలు లేకుండానే ప్రమాణ స్వీకార కార్యక్రమం..
ఇండస్ట్రీ పెద్దలు లేకుండా కేవలం మోహన్ బాబు ఇతర ఆర్టిస్టుల సమక్షంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కావడం గమనార్హం. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వ సహకారం ఉంటుందని మంత్రి తెలిపారు. ఇంతటితో ‘మా’ అసోసియేషన్ గొడవలు ముగిసిపోతాయా? అంటే లేదనే సమాధానం సినీ వర్గాల నుంచి వస్తోంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా అంశం, మంచు విష్ణు వాగ్దానాల అమలుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతారు అనేది భవిష్యత్తులో చర్చనీయాంశంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.