ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు బాగా ఏడ్చాను.. చిరంజీవి కామెంట్స్ వైరల్
చిరంజీవి కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రంగా ఖైదీ సినిమా ఎప్పటికీ చరిత్రలో నిలిచే ఉంటుంది. ఖైదీ యాక్షన్ సీక్వెన్స్, అంతటి రివేంజ్ డ్రామా అప్పటి వరకు తెలుగు తెరపై ఎప్పుడూ చూడలేదు. అదే అప్పటి ప్రేక్షకుల కొత్త అనుభూతిని తీసుకొచ్చింది. ఖైదీ సినిమాను ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెట్టింది. ఈ సినిమాతోనే చిరంజీవికి స్టార్డం వచ్చింది. అయితే ఖైదీ అంతటి విజయం తరువాత చిరంజీవికి దారుణమైన ఫ్లాప్ వచ్చింది.

Chiranjeevi about veta Movie result
నిధిని అన్వేషించడం అంటూ తెరకెక్కిన వేట సినిమా చిరు కెరీర్‌లో డిజాస్టర్‌గా మిగిలింది. ఖైదీ అంతటి బ్లాక్ బస్టర్ తరువాత రావడంతో అంచనాలు ఆకాశంలో ఉండేవి. వాటిని అందుకోలేక వేట చతికిలపడిపోయింది. నాటి సంగతులను తాజాగా చిరు పంచుకున్నాడు. సమంత సామ్ జామ్ షోలో మాట్లాడుతూ.. తాను ఏడ్చిన సందర్భాల గురించి చెబుతూ.. వేట విషయాన్ని ప్రస్థావించాడు.
‘వేట’ విడుదలయ్యాక బాగా ఏడ్చేశాను. ‘ఖైదీ’ తర్వాత విడుదలైన చిత్రం కావడంతో ‘వేట’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కాకపోతే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో ఇంట్లో కూర్చొని బాధపడ్డా. అలాగే, ‘విజేత’ సినిమా ఎప్పుడు చూసినా నాకు కన్నీళ్లు వచ్చేస్తాయ్ అని చిరంజీవి తన సినీ ప్రయాణం గురించిచెప్పుకొచ్చాడు. మొత్తానికి విజయాలు అపజయాలు వెనువెంటనే ఉంటాయని చిరు నిరూపించాడు.