ఆరు పదుల వయసులోనూ తగ్గని జోరు.. ఉపాసన తల్లి సైకిల్ యాత్ర
కొందరు నిత్యం ఏదో ఒకటి సాధించాలని పరితపిస్తుంటారు. వయసు అడ్డంకి కాదని నిరూపించేందుకు అడ్వెంచర్లు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మహిళలు అన్నింటా ముందుంటున్నారు. మహిళా సాధికారిత పేరిట వారు సాధించే విజయాలు ఎంతగానే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఉపాసన తల్లి శోభనా కామినేని అందరినీ అబ్బురపరిచేలా సైకిల్ యాత్ర చేసింది. అది కూడా హైద్రాబాద్ నుంచి చెన్నై వరకు సైకిల్ యాత్ర చేపట్టి అందరినీ షాక్‌కు గురి చేసింది.
అపోలో ఆస్పత్రుల వైస్ చైర్‌పర్సన్ శోభనా కామినేని తన 60వ పుట్టినరోజు వేడుకను వినూత్నంగా జరుపుకున్నారు. ఈ నెల 25న ఉదయం తన భర్త అనిల్ కామినేనితో కలసి చాలెంజ్ టు సైకిల్ టు చెన్నై ఫ్రం హైదరాబాద్ అనే నినాదాన్ని ఎంచుకొని బయల్దేరారు. రోజుకు వంద కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ ఆరు రోజుల్లో 642 కిలోమీటర్లు వెళ్ళి చెన్నైలో తన తండ్రి ప్రతాప్.సి.రెడ్డిని బుధవారం కలుసుకొని సంతోషం పంచుకున్నారు. సైక్లింగ్‌తో తన భర్త, కూతురుతో కలసి ఔటింగ్‌కు వెళ్లిన ఆనందం కలిగించిందని ఆమె తెలియజేశారు.
సైకిల్ రైడింగ్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఒక మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదనే నమ్మకానికి పునాది వేసిందని పేర్కొన్నారు. తన తల్లి శోభనా కామినేని తన 60వ పుట్టినరోజున హైదరాబాద్ నుంచి చెన్నైకి 642 కిలోమీటర్లు సైకిల్ రైడింగ్ చేస్తూ వెళ్లడం తనకెంతో గర్వంగా ఉందని ఉపాసన కొణిదెల ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది. ఇప్పుడు ఉపాసన తన భర్త రామ్ చరణ్‌తో కలిసి క్వారంటైన్‌లో ఉండటంతో ఆ అమూల్యమైన సమయాన్ని తల్లితో గడపలేకపోతోన్నానని చెప్పుకొచ్చింది.