YS Jagan : 175 – 175.. వైఎస్ జగన్ ధైర్యమేంటి.?
YS Jagan : దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా మొత్తంగా అన్ని సీట్లలోనూ గెలుచుకునే అవకాశం వుంటుందా.? ఏం, ఎందుకు వుండకూడదు.? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు షాక్ ఇవ్వలేదా.? మరీ నూటికి నూరు శాతం కాకపోయినా, ఆ స్థాయిలోనే ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మొత్తంగా 175 స్థానాల్లోనూ తన పార్టీని గెలిపించి, దేశ రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించాలనుకుంటున్నారు. ‘ఒక్కటంటే ఒక్కటి కూడా వదులుకోవద్దు ఈసారి..’ అంటూ పార్టీ శ్రేణుల్ని వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
‘ఏమేం చేశామో రిపోర్ట్ ప్రజలకే ఇస్తున్నాం.. అలాంటప్పుడు, మనల్ని ఎందుకు అన్ని చోట్లా ప్రజలు గెలిపించరు.? కాకపోతే, చేసిన మంచి పనుల గురించి ఇంకా బలంగా చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీదనే వుంది..’ అంటూ తాజాగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు చేసిన సూచన.. చాలా చాలా ప్రత్యేకం. 2019 ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లకు గాను 151 సీట్లు వచ్చాయి. ఓ ఏడెనిమిది మంది ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షాలు వున్నా లేనట్లే. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్, వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనీ, విపక్షాలకు గుండు కొట్టాలనీ అనుకోవడంలో వింతేమీ లేదు.
అయితే, రాజకీయం ఎప్పుడూ ఒకేలా వుండదు. ఎన్నికలంటే చాలా అంశాలు కీలక భూమిక పోషిస్తాయి. ఓటర్లకు 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, 2024 ఎన్నికల నాటికి వాటిల్లో ఎన్నిటిని ప్రభుత్వం నెరవేర్చింది.? అనే లెక్క ఖచ్చితంగా ప్రజల్లో వుండి తీరుతుంది. సంక్షేమం విషయంలో వైసీపీకి తిరుగు లేదు. కానీ, అభివృద్ధి సంగతేంటి.? రాజధాని సహా ప్రత్యేక హోదా తదితర అంశాల సంగతేంటి.? వైఎస్ జగన్ 175 సీట్లలో గెలవాలంటే, ఈ అంశాలపైనా స్పష్టత అధికార పార్టీ తరఫున వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది.