Revanth Reddy : రేవంత్ రెడ్డి.. ఏకాకి కానున్నారా? కాంగ్రెస్ లో చేరి పెద్ద తప్పు చేశారా?
Revanth Reddy : తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నికయి 2 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన కొత్త జోరు మాత్రం ఏం లేదు. ఇది వరకు ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది. అంతకు మించి పార్టీ దిగజారిపోయిందని కూడా చెప్పుకోవాలి. ఆయన ఎప్పుడైతే పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారో అప్పటి నుంచి ఆయనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పార్టీలో అంతర్గత విభేదాలు కూడా వచ్చాయి. అసలు..ఆయన పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఒరిగింది కూడా ఏం లేదు. పార్టీ చేపట్టిన కార్యక్రమాలు కూడా లేవు. ఏదో భారత్ జోడో యాత్రను మాత్రం నిర్వహించారు.
అది కూడా రాహుల్ గాంధీ యాత్ర కాబట్టి ఆ కార్యక్రమాన్ని మాత్రం చేపట్టారు.ఇప్పటి వరకు జరిగిన అన్ని ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అసలు పార్టీ రోజురోజుకూ దిగజారిపోతుంటే.. పార్టీలోని నేతలు మాత్రం ఒకరి మీద మరొకరు నిందలు వేసుకుంటున్నారు. ముందు కొంతమంది సీనియర్ నేతలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ తర్వాత పార్టీలో రెండు వర్గాలు వచ్చి చేరాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం తప్పితే పార్టీ కోసం పాటుబడే వాళ్లు మాత్రం లేరు. ప్రస్తుతం రేవంత్ వ్యతిరేక వర్గం, రేవంత్ అనుకూల వర్గం అంటూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి.
Revanth Reddy : మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా రేవంత్ పై ఫైర్ అవుతున్నారా?
మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంలో చేరిపోయారట. ఉత్తమ్ తో పాటు చాలామంది సీనియర్ నేతలు రేవంత్ పై రివర్స్ అవుతూ వస్తున్నారు. అయితే.. ఇలా పార్టీలో ఇష్టా రాజ్యంగా ఎవరికి వారు వ్యవహరించడానికి కారణం.. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్ అని అంటున్నారు. అసలు.. పార్టీ వ్యవహారాలపై కరెక్ట్ గా ఉండాల్సిన మాణికం ఠాగూర్ ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం ఏంటి అంటూ విమర్శలు వస్తున్నాయి. కమిటీల నియామకంలోనూ ఠాగూర్ ఏకపక్షంగా వ్యవహరించారని అందుకే ప్రస్తుతం పార్టీలో ఇలాంటి సమస్యలు వచ్చి చేరాయని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?