Hyd: మేయర్ ఎంపికకు అమావాస్య టెన్షన్? ఆరోజు ప్రమాణస్వీకారం చేయమంటున్న బీజేపీ కార్పొరేటర్లు?
ఇటీవలే జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వెలువడ్డాయి కానీ.. ఇంకా కొత్త పాలక వర్గం చార్జ్ తీసుకోలేదు. దానికి కారణం.. ఇంకా పాత పాలకవర్గం గడుపు ముగియకపోవడమే. పాత పాలక వర్గం గడువు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 11వ తారీఖుతో ముగుస్తుంది. దీంతో అదే రోజున కొత్త మేయర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త పాలక వర్గం కొలువు తీరాల్సి ఉంటుంది.
అంతవరకు బాగానే ఉంది కానీ.. ఫిబ్రవరి 11వ తారీఖుతోనే ఇప్పుడు కొందరికి సమస్య వచ్చిపడింది. ఎందుకంటే.. ఆరోజు అమావాస్య. హిందువులు అమావాస్య రోజున ఏ పనులు ప్రారంభించరు. కొత్త పనులను చేపట్టరు. అలాంటిది ఆరోజు కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేయడమంటే కష్టమని కొందరు వెనక్కి వెళ్తున్నారు. ముఖ్యంగా బీజేపీ కార్పొరేటర్లు అయితే ఆరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి ఇష్టపడటం లేదు.
ముహూర్తాలను నమ్మేవారు వెనక్కి
ముహూర్తాలను, జ్యోతిష్యాన్ని నమ్మేవారు మాత్రం ఆరోజు అస్సలు ప్రమాణ స్వీకారం చేయబోమని స్పష్టం చేస్తున్నారు. మంచి రోజు కాకపోవడం వల్ల ఆరోజు ప్రమాణ స్వీకారం చేయకుండా ఎగ్గొట్టాలని కొందరు బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నారు. కొందరు బీజేపీ నేతలు డుమ్మా కొడితే.. వాళ్లకు బలం తగ్గి.. టీఆర్ఎస్ కు పెరుగుతుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ మేయర్ సీటను కైవసం చేసుకునేందుకు పథకాలను రచిస్తోంది.
ముహూర్తం మార్చండి
అయితే.. కొందరు బీజేపీ నేతలు మాత్రం ఆ రోజు ముహూర్తాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దాని కోసం జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు కానీ.. తన చేతుల్లో ఏం లేదని.. అది ఎన్నికల కమిషన్ నిర్ణయం అంటూ స్పష్టం చేయడంతో.. ఏం చేయాలో తెలియక బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఒకవేళ ఆరోజు గనుక కోరం లేకపోతే.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడుతుందని.. బీజేపీ కార్పొరేటర్లు మాత్రం డుమ్మా కొడితే కోరం సమస్య వచ్చే అవకాశం లేదు కానీ.. మిగితా అన్ని పార్టీల సభ్యులు డుమ్మా కొడితే మాత్రం కోరం ఉండదు. అప్పుడు వేరే రోజున మేయర్, డిప్యూటీ మేయర్ ను ఎన్నుకుంటారు. కానీ.. ఆరోజున మిగితా పార్టీల కార్పొరేటర్లు డుమ్మా కొట్టరు కదా.. ఏంటో చూద్దాం మరి.. ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో ఏం జరుగుతుందో?