ఆంధ్రప్రదేశ్ రోడ్లు బాగు అవ్వడం కోసం జగన్ మరొక సంచలన నిర్ణయం?
ఏపీలో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఏదో హైవేలు తప్పితే.. మిగితా చోట్ల ఎక్కడా రోడ్లు సరిగ్గా లేవు. ఇప్పుడే కాదు.. ఉమ్మడి ఏపీలో కూడా రోడ్ల పరిస్థితి అంతే. ముఖ్యమంత్రులు అయితే మారుతున్నారు కానీ.. రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

ap cm ys jagan big decision over ap roads
అందుకే.. ఏపీలో ఉన్న రహదారులను ఎంత ఖర్చయినా మరమ్మతు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించి… కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, న్యూ డెవలప్ మెంట్ బ్యాంకుల మధ్య రుణ ఒప్పందం కూడా చోటు చేసుకున్నది.
టెండర్లు ఓకే అవడంతో.. త్వరలోనే ఏపీలోని రహదారులకు మహర్దశ పట్టనుంది. ఆర్ అండ్ బీ, న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు సహకారంతో రహదారులను ప్రభుత్వం పునరుద్ధరించనుంది.
అలాగే.. రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్, ఏపీ ఆర్బీఆర్పీ కింద రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం రెండు మెగా ప్రాజెక్టుల కింద నిర్మాణం జరగనుండగా… దీని కోసం ప్రాజెక్టు వ్యయం 6400 కోట్లు కానుంది. దీంట్లో న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ వాటా కింద 70 శాతం, ఏపీ ప్రభుత్వం వాటా కింద 30 శాతం భరించనుంది.
జిల్లాలు, మండలాలకు బెస్ట్ కనెక్టివిటీ కోసం
ఈ ప్రాజెక్టుల వల్ల.. ఏపీలోని ప్రతి జిల్లా నుంచి ఆ జిల్లాల అన్ని మండలాలకు డబుల్ లేన్ రోడ్లుగా విస్తరించనున్నారు. అన్ని మండలాలను కలుపుతూ.. జిల్లా కేంద్రానికి రోడ్డును విస్తరించడం అన్నమాట. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా.. మొత్తం 3104 కిలోమీటర్ల మేర రహదారులను విస్తరించనున్నారు. ఇప్పటికే అనుమతులు కూడా రావడంతో.. ఇక త్వరలోనే రహదారుల పునరుద్ధరణ పనులు వేగవంతం కానున్నాయి. మొదటి దశలో భాగంగా 1243 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించనున్నారు. దీని కోసం 2978 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. సంక్రాంతి పండుగ తర్వాత పనులు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.