AP Digital Corporation : ఏపీ డిజిటల్ కార్పోరేషన్‌కు వాట్సప్ సేవలు
AP Digital Corporation : కాలంతో మనం మారినప్పుడు మాత్రమే అభివృద్ది సాధ్యం అవుతుంది. అంది వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ దూసుకు పోయినప్పుడు మాత్రమే లాభాలను దక్కించుకుంటూ పోటీ ప్రపంచంలో ముందు ఉంటాం. మనం చేస్తున్న కార్యక్రమాలు.. మనం చేపట్టిన అభివృద్ది అందరికి తెలియాలంటే కింది స్థాయి వరకు వాటిని తీసుకు వెళ్లాలి అనేది ఇటీవల జగన్ మోహన్ రెడ్డి వైకాపా నాయకులతో చెప్పిన మాటలు. చేస్తున్నది కొండంత అయినా జనాలకు ప్రచారంలోకి వెళ్తున్నది మాత్రం గోరంత అన్నది వైకాపా నాయకుల అభిప్రాయం. అందుకే జనాలకు అన్ని విషయాలు తెలియజేసే ఉద్దేశ్యంతో వాట్సప్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఏపీ ప్రభుత్వం నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమం మరియు అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల గురించి జనాల్లోకి తీసుకు వెళ్లడం కోసం వాట్సప్ ను వినియోగించుకోబోతున్నట్లుగా ఏపీ డిజిటల్ కార్పోరేషన్ ప్రకటించింది. ప్రభుత్వ పథకాలు మరియు సంక్షేమ పథకాల నిధుల గురించి ఈమద్య కాలంలో విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తూ జనాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి తప్పుడు వార్తలకు చెక్ పెట్టేందుకు కూడా ప్రభుత్వంకు వాట్సప్ సహకరించబోతున్నట్లుగా ఏపీ డిజిటల్ కార్పోరేషన్ సభ్యులు పేర్కొన్నారు.
వాట్సప్ తో ఏపీ డిజిటల్ కార్పోరేషన్ ఒప్పందం జరిగి పోయింది. ఇండియాలో వాట్సప్ తో ఇలా ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏపీ మాత్రమే. రాష్ట్రంలో టెక్నాలజీ పెరగడం లో ఈ ఒప్పందం మరింత దోహదం చేస్తుందని వైకాపా నాయకులు అంటున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ గవర్నెన్స్ లో భాగంగా ఈ ఒప్పందం జరిగిందని వారు తెలియజేశారు. రాష్ట్రంలో వాట్సప్ వినియోగదారులు భారీగా ఉన్న కారణంగా ప్రతి ఒక్కరికి ఇక నుండి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి పూర్తి క్లారిటీ గా స్థానిక భాషలో సందేశాలు అందబోతున్నాయి.