BBC Documentary : ఆంధ్ర యూనివర్సిటీలో చిచ్చు పెట్టిన బీబీసీ డాక్యుమెంటరీ
BBC Documentary : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏ యూనివర్సిటీలో చూసినా అదే గొడవ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మీద బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన విషయంలో సర్వత్రా గొడవ జరుగుతోంది. నిజానికి ఆ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఢిల్లీ, కోల్ కతా యూనివర్సిటీలలో దాన్ని ప్రదర్శించకుండా యూనివర్సిటీ అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా దాన్ని వైజాగ్ లోని ఆంధ్రా యూనివర్సిటీలో ప్రదర్శించడానికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించిన తర్వాత దాన్ని ఎలా ప్రదర్శిస్తారని
ఏబీవీపీ నేతలు మండిపడుతున్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు దాన్ని ప్రదర్శించడంపై యూనివర్సిటీలో గొడవ ప్రారంభమైంది.చారిత్రక నేపథ్యం ఉన్న ఇలాంటి యూనివర్సిటీలో ఇలాంటి చర్యలు ఏంటంటూ ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఇలాంటి కార్యక్రమాలకు కొందరు యూనివర్సిటీ అధికారులు కూడా మద్దతు ఇస్తున్నారని, అలా ఇవ్వడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. ఏయూలో ఎవరు డాక్యుమెంటరీని ప్రదర్శించారో.. విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.
BBC Documentary : శుక్రవారం రాత్రి గుట్టు చప్పుడు కాకుండా డాక్యుమెంటరీ ప్రదర్శన
శుక్రవారం రాత్రి ఆంధ్రా యూనివర్సిటీలో గుట్టుచప్పుడు కాకుండా డాక్యుమెంటరీని ప్రదర్శించడంపై ఏబీవీపీ, బీజేపీ నేతలు ఏయూ యాజమాన్యంపై సీరియస్ అయ్యారు. ఏయూ వామపక్ష విద్యార్థి సంఘాలకే సపోర్ట్ ఎక్కువగా ఉందని, అందుకే దాన్ని ప్రదర్శించారని, అసలు దాన్ని నిషేధించకుండా ఉండి ఉంటే.. దాని గురించి ఎవ్వరూ పట్టించుకునే వారు కాదని.. దాన్ని ఎందుకు నిషేధించారు అంటూ కొందరు విద్యార్థులు పెదవి విరిచినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా బీబీసీ డాక్యుమెంటరీ దేశ వ్యాప్తంగా విద్యార్థుల మధ్య చిచ్చురేపుతోంది.