Jr NTR – BJP : బీజేపీ వైపు ఎన్టీయార్ చూస్తే, అంతే సంగతులు.!
Jr NTR – BJP : కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో తనను కలిసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల లోలోపల యంగ్ టైగర్ ఎన్టీయార్ చాలా ఆనందం వ్యక్తం చేస్తుండొచ్చు. తెలునాట, బోల్డంత ఫాలోయింగ్ వున్న నటుడు జూనియర్ నందమూరి తారకరామారావు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో చాలా బాగా నటించాడు. దేశమంతా ఆయన నటనను మెచ్చుకుంది. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా, జూనియర్ నందమూరి తారకరామారావు నటనకు ఫిదా అయి వుండొచ్చు.
కానీ, జూనియర్ ఎన్టీయార్ లాగానే, ఆ మాటకొస్తే అంతకు మించి పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్.. ఇదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో. పైగా, దేశమంతా రామ్ చరణ్‌ని రాముడిగా పూజించింది. మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే, రామ్ చరణ్‌లో రాముడ్ని చూశారు. కానీ, అమిత్ షా తెలంగాణ పర్యటనలో రామ్ చరణ్‌ని కలవలేదు. అన్నట్టు, చిరంజీవిని బీజేపీలోకి లాగేందుకు బీజేపీ అధినాయకత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల భీమవరం పర్యటనలో చిరంజీవితో ముచ్చటించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పుడేమో అమిత్ షా తెలంగాణలో యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో మంత్రాంగానికి స్కెచ్ వేశారు. చిరంజీవి వేరు, జూనియర్ ఎన్టీయార్ వేరు. చిరంజీవి, రాజకీయాల్లో గతంలో వున్నారు. కానీ, ఇప్పుడు రాజకీయాల్లో లేరు. కానీ, చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశమైతే వుంది.
యంగ్ టైగర్ ఎన్టీయార్ వ్యవహారం పూర్తిగా భిన్నం. ఆయన ఇంకా చాలా కాలం పాటు సినీ రంగంలో వుండాలి. ఇప్పుడున్న రాజకీయాల్లో, సినీ ప్రముఖులు ఏదన్నా రాజకీయ పార్టీ వైపు వంగితే, ఆ తర్వాత అంతే సంగతులు. పైగా, తెలంగాణ రాజకీయం మరీ భిన్నం. బీజేపీ వైపు ఎన్టీయార్ చూస్తే అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ ఆయన సినిమాలకు ఇబ్బందులు రావొచ్చు. సో, ఎన్టీయార్ తెలివైనోడు.. మర్యాద పూర్వక భేటీతోనే సరిపెట్టే అవకాశాలెక్కువ. అంతే తప్ప, బీజేపీ తరఫున వకాల్తా ఆయన పుచ్చుకునే అవకాశమే లేదు.