CM KCR : సీఎం కేసీఆర్ బీజేపీ వ్యూహంలో చిక్కుకుపోయారా? సర్వాయి పాపన్న గౌడ్ విషయంలో ఇరకాటంలో పడిపోయారా?
CM KCR : 2023 ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. దానిలో భాగంగానే తెలంగాణలో యాక్టివ్ గా రాజకీయాల్లో బీజేపీ నేతలు పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం బీజేపీ సరికొత్త నినాదాన్ని వినిపిస్తోంది. అది కేవలం టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టేందుకే. బహుజన సమాజాన్ని ఆదరించేందుకు.. వాళ్లను ఆకట్టుకునేందుకు కొత్త అంశాన్ని బీజేపీ తెర మీదికి తీసుకొచ్చింది. అదే జనగామ జిల్లాను సర్వాయి పాపన్న గౌడ్ అని పేరు పెట్టాలని.. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని బీజేపీ కొత్త నినాదం అందుకుంది. ఇవాళ అంటే గురువారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కదా. ఆయన జయంతిలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కే లక్ష్మణ్ మాట్లాడుతూ… తెలంగాణ జాతి గర్వపడేలా బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి సర్వాయి పాపన్న అని తెలిపారు. నిజాం ఆగడాలపై ఆయన ఎంతో వీరోచితంగా పోరాటం చేశారని తెలిపారు. సర్వాయి పాపన్న లాంటి ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే మనం నేడు తెలంగాణ గడ్డ మీద స్వేచ్ఛగా బతుకుతున్నామని తెలిపారు.
CM KCR : కేసీఆర్ పాలనను భూస్థాపితం చేస్తేనే సర్వాయి పాపన్నకు ఘనమైన నివాళి
అలాగే.. కేసీఆర్ పై లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ నిజాం తరహా పాలన చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ పాలనను భూస్థాపితం చేస్తేనే సర్వాయి పాపన్నకు ఘనమైన నివాళి అవుతుందని తెలిపారు. కుటుంబ పాలనతో కేసీఆర్ తెలంగాణనే దిగజార్చారని ఆయన మండిపడ్డారు.అయితే.. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా జనగాం జిల్లాకు సర్వాయి పాపన్న పేరును పెట్టాలని బీజేపీ డిమాండ్ చేయడం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే తెలంగాణలో 33 జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి జనగామ జిల్లాను విభజించారు. కొత్తగా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఆ జిల్లాను బీజేపీ సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మార్చాలని కోరుతోంది. దానికి కారణం.. సర్దార్ సర్వాయి పాపన్నది జనగామ జిల్లానే. ఆయన ఆగస్టు 18, 1650 న, ఇప్పటి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించారు. గోల్కొండ కోటపై బడుగు బలహీన వర్గాల జెండాను ఎగురవేసి దాదాపు 12 వేల మంది సైనికులను సమకూర్చగలిగారు. తెలంగాణలో మొగలాయి విస్తరణను సర్వాయి పాపన్న తొలిసారి అడ్డుకున్నారు. దాదాపు 20 కోటలను పాపన్న తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.