Botsa Satyanarayana : రాజధాని విషయం రాష్ట్రం పరిధిలోనిది.. మూడు రాజధానులే మా విధానం
Botsa Satyanarayana : ఏపీ రాజధాని గా అమరావతినే కొనసాగించాల్సిందే అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై వైకాపా నేత మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర మంత్రులు పలు దఫాలుగా చెప్పడం జరిగింది. రాజధాని నిర్మాణం మరియు రాజధాని ఏర్పాటు అన్ని కేంద్రం రాష్ట్రానికి అప్పగించిన నేపథ్యంలో ఇప్పుడు అమరావతి ఒక్కటే కాకుండా మరో రెండు రాజధానులను కూడా ఏపీ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కాని ఒక సామాజిక వర్గం కోసం రాజధానిగా అమరావతి ఉండాలంటూ తెలుగు దేశం పార్టీ మరియు ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఐదు కోట్ల మంది ఆకాంక్ష కు అనుగుణంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. హైకోర్టు తీర్పుని కొందరు రాజకీయ నాయకులు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీడియాలో కూడా హైకోర్టు తీర్పు వక్రీకరణ చేస్తు కథనాలు వస్తున్నాయి అంటూ బొత్స ఆరోపించారు.ఈ తీర్పుపై తాము సుప్రీం కోర్టుకు వెళ్లాలని భావించడం లేదని న్యాయ నిపుణులతో చర్చించి ముందుకెళ్తాం అంటూ ఆయన పేర్కొన్నాడు.
ఇప్పటికి కూడా జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్ణయానికి కట్టుబడి ఉందని ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా కూడా ఏపీకి రాజధానిగా మూడు రాజధానులు నిర్ణయం తీసుకు వస్తా అంటూ మంత్రి హామీ ఇచ్చారు. ఇది ప్రతి ఒక్క ఆంద్రప్రదేశ్ ప్రజల కోరిక అంటూ ఆయన పేర్కొన్నాడు. తెలుగు దేశం పార్టీ మరియు ఇతర పార్టీలు అమరావతి రాజధానిగా ఎందుకు కావాలనుకుంటున్నారో ప్రజలకు తెలుసని, ఏపీ ప్రజలు కచ్చితంగా వారికి బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుందని అన్నారు. కోర్టు తీర్పును గౌరవిస్తాం అదే సమయంలో ప్రజలకు న్యాయం చేసే విధంగా తాము వ్యవహరిస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.