TDP : ఇక నేను తట్టుకోలేను.. అని చంద్రబాబు గట్టిగా అరిచేలా.. ఆయన్ను పదవుల కోసం ఇబ్బందులు పెడుతున్న నేతలు?
అనంతపురం : సాధారణంగా అధికార పార్టీకి పదవుల విషయంలో తలనొప్పులు ఎదురవుతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. అనూహ్యంగా ప్రతిపక్షంలో పదవుల కోసం పోటీ నెలకొంది. అసలే ఘోరంగా ఓడిన పార్టీలో పదవుల కోసం కొట్లాటలు తప్పడం లేదు. ఇవి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తలనొప్పులు తెప్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధిష్టానం నాయకులను ఎంపిక చేసింది. పార్లమెంటరీ కమిటీ నుంచి నియోజకవర్గ స్థాయి కమిటీల వరకు నేతలకు పగ్గాలు అప్పజెప్పారు. అన్ని చోట్లా సజావుగా సాగిన పదవుల పంపకాలు.. అనంతపురం జిల్లాలో మాత్రం చిచ్చుపెడుతున్నాయి.
నేతల మధ్య సరైన సఖ్యత లేకపోవడంతో జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటో కూడా అధిష్టానానికి తెలియని దుస్థితి నెలకొంది. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా పార్థసారధి ఉన్నారు. ఇక హిందూపురం పార్లమెంటరీ కార్యదర్శిగా లక్ష్మి నారాయణను నియమించిన అధిష్టానానికి అనంతపురం పార్లమెంటరీలో మాత్రం బ్రేకులు పడింది. పార్లమెంటరీ పరిధిలో ఉన్న రెండు మూడు నియోజకవర్గాల నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తమకంటే తమకే ప్రధాన కార్యదర్శి పోస్టు ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కమిటీ ఏర్పాటుతో.. TDP
ముఖ్యంగా సింగనమల, ఉరవకొండలో మధ్య వర్గ పోరు కొనసాగుతున్నట్లు సమాచారం. శ్రీధర్, రామలింగారెడ్డి ఈ పోటీలో ఉన్నారని తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శి పోస్టులు మాకే ఇవ్వాలని వీరిద్దరూ .. లోకేష్, చంద్రబాబును కలసి కోరినట్లు సమాచారం. తాము పదవి చేపడితే వచ్చే ఎన్నికల్లో విజయం తధ్యం అని అధినేత వద్ద మార్కులు కొట్టే ప్రయత్నం చేశారనే టాక్ నడుస్తోంది. అంతే కాదు తాము వారికే పార్టీ పదవులను ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ లను తమ వారికే కట్టబెట్టాలని ఒత్తిడిని తెస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పదవి ఏదైనా తమ వారికే దక్కాలనే ధోరణితో ఏమాత్రం తగ్గేదే లే అంటున్నారు. దీంతో అధిష్టానం పదవులపై ఎటూ తేల్చక నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. తాజాగా ఈ సమస్యను అధిగమించేందుకు టీడీపీ అధిష్టానం ఓ కొత్త పధకాన్ని రచించినట్లు సమాచారం. అనంత పార్లమెంట్ నియోజకవర్గంలో పదవుల పంపకాల కోసం ఓ కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు నేతలతో కమిటీ వేసి అందరి ఏకాభిప్రాయం మేరకు నియామకాలు చేపట్టే అవకాశముంది. మరి .. ఈ కమిటీ ఏమి తేల్చనుందో.. అటు తర్వాత .. పార్టీలో ఎంత రచ్చ జరగనుందో అన్నదే చర్చనీయాంశంగా మారింది.