Hyderabad : హైద్రాబాద్ మీద క్లౌడ్ బరస్ట్ కుట్ర.! మేఘాల వెనుక ఎవరు.?
Hyderabad : హైద్రాబాద్ మీద కూడా కుట్ర జరిగింది. ఇది కూడా విదేశీ కుట్ర అనే అనుకోవాలేమో. ఎందుకంటే హైద్రాబాద్ నెత్తిన క్లౌడ్ బరస్ట్ జరిగింది. భారీ వర్షం కురిసింది. చిన్న విషయం కాదు. చాలా సీరియస్‌గా తీసుకోవాలేమో దీన్ని. ఎందుకంటే, మొన్నీమధ్యనే గోదావరి నదికి వరదలొస్తే, వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్లౌడ్ బరస్ట్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనీ, ఇలాంటి సంఘటనల్లో విదేవీ కుట్ర వుండొచ్చని అనుమానం వ్యక్తం చేసేశారు.
సో, హైద్రాబాద్ మీద కూడా అచ్చంగా అలాంటి కుట్ర జరిగి వుండొచ్చేమో. అలాగని కేసీయార్‌కి కూడా అనుమానం ఈపాటికే వచ్చి వుండాలి. హైద్రాబాద్‌లో పలు చెరువులు ఈ భారీ వర్షానికి నిండిపోవడం, పలు కాలనీల్లోకి పెద్దయెత్తున నీటి ప్రవాహం రావడం కూడా జరుగుతోందట. భారీ వర్షాలంటే హైద్రాబాద్ నగరం వణికిపోతోంది. గత అనుభవాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.రాజకీయాల సంగతి పక్కన పెడితే, జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. గతంలోలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రమాదకర ప్రాంతాల్లో వున్న ప్రజలకు అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అయితే, గతంలో సంభవించినట్లు ఈసారి అంతటి భారీ వర్షాలు కురవకపోవచ్చునని వాతావరణ శాఖ చెబుతోంది.
కానీ, క్లౌడ్ బరస్ట్ కొనసాగితేనో.? ఈ విషయమై భారతీయ జనతా పార్టీ, సోషల్ మీడియా వేదికగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఓ ఆట ఆడుకుంటోంది. పలు మీమ్స్ ప్రచారంలోకి తెచ్చింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి మీద విరుచుకుపడుతోంది. కేసీయార్ అలాగే కేటీయార్ మీద కూడా పంచ్ డైలాగులు పేలుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. భాగ్యనగరం హైద్రాబాద్. ఇంతటి గొప్ప నగరంపై వాన పీడ ప్రతిసారీ ఎందుకు ఇంతలా విరుచుకుపడుతున్నట్లు.? తప్పెవరిది.? ఏళ్ళు గడుస్తున్నా డ్రైనేజీ వ్యవస్థ మెరుపడటంలేదు. నాలాల కబ్జా కొనసాగుతూనే వుంది. పురాతన భవనాలు ఎప్పటికప్పుడు ప్రమాదకరంగా మారడమే కాక, ఆయా సందర్భాల్లో జనాల ప్రాణాలూ తీసేస్తున్నాయి. అయినా, పాలకుల్లో చలనం లేదు సరికదా.. క్లౌడ్ బరస్ట్.. విదేశీ కుట్ర అనడమొకటి.!