ఓ వైపు రైతుల ధర్నా.. మరోవైపు కరోనా? ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్?
గత 15 రోజుల నుంచ దేశ రాజధాని ఢిల్లీ బోర్డర్ వద్ద వేల సంఖ్యలో పంజాబ్, హర్యానా రైతులు ధర్నా చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ తమ నిరసన గళాన్ని విప్పుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చించినప్పటికీ.. ఆ చర్చలు సఫలం కాలేదు. దీంతో రైతులంతా తమ ఆందోళనను ఉదృతం చేశారు. ఢిల్లీ బోర్డర్ వద్ద ఆందోళనను కొనసాగిస్తున్నారు.
అయితే.. మరో వైపు ఢిల్లీలో కరోనా వ్యాప్తి కూడా శరవేగంగా పెరుగుతోంది. ఢిల్లీ ఈ సమయంలో ఎక్కువగా చలి ఉంటుంది. అది కరోనా వ్యాప్తికి దోహదం చేస్తోంది. దీని వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ధర్నా చేస్తున్న రైతులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువ.
ఇప్పటికే.. రైతుల ధర్నా వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకు కరోనా సోకింది. దీంతో యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ఆ ఇద్దరు పోలీసు ఆఫీసర్లను హోం క్వారంటైన్ కు తరలించారు.
రైతులకు కూడా కోవిడ్ ముప్పు పొంచి ఉండటంతో… ఏం చేయాలో తెలియక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఓ వైపు రైతుల నిరసన రోజురోజుకూ పెరుగుతోంది. గుంపులు గుంపులుగా రైతులు ఒకేచోట ఉంటూ ధర్నా చేస్తుండటం వల్ల కరోనా ముప్పు ఎక్కువవుతోందని ప్రభుత్వ యంత్రాంగం ఆందోళన చెందుతోంది.
రాత్రి పూట తీవ్రంగా ఉన్న చలిని కూడా లెక్కచేయకుండా.. 16 రోజుల నుంచి ఢిల్లీకి దగ్గర్లోని సింఘ, టిక్రీ బోర్డర్ వద్ద వేల సంఖ్యలో రైతులు బైఠాయించిన సంగతి తెలిసిందే.