Corona Second Wave : కరోనా వచ్చిందా? బెడ్లు ఖాళీ లేవు? ఎవరైనా పోతే ఇస్తామంటున్న ఆసుపత్రులు?
Corona Second Wave : కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. చాప కింద నీరులా కరోనా విస్తరిస్తోంది. అసలు.. ఏం జరుగుతోందో కూడా అర్థం కావడం లేదు. అటు చూసి ఇటు చూసే లోపల జరగరాని ఘోరం జరుగుతోంది. రోజు రోజుకూ కేసులు రెట్టింపు అవుతున్నాయి. అసలు ప్రజలకు అయితే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎక్కడ చూసిన కరోనానే. ఆసుపత్రుల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. కరోనాతో చనిపోయిన రోగుల మృతదేహాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఆసుపత్రుల్లో ఓమూలకు కుప్పలుకుప్పలుగా శవాలను పడేస్తున్నారు. అసలు.. కరోనా ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే ప్రభుత్వాలు ఎందుకు నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు అర్థం కావడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. రోజుకూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. పెద్ద పెద్ద నగరాల్లో అయితే రోజూ వందల మంది కరోనాతో ప్రాణాలు విడుస్తున్నారు. కొందరికి వెంటిలేటర్లు దొరక్క…. మరికొందరికి ఆక్సీజన్ అందక… ఇంకొందరికి బెడ్లు దొరక్క… మృత్యువాత పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఏ ఆసుపత్రి చూసినా నిండిపోయింది. ఎక్కడా బెడ్లు ఖాళీ లేవు. బెడ్లు ఖాళీ లేక ఆసుపత్రుల్లో చేర్చుకోకపోవడంతో… ఆసుపత్రుల బయటే చాలామంది రోగులు తమ ప్రాణాలను విడుస్తున్నారు. ఆసుపత్రుల్లో బెడ్ ఇవ్వాలని అడిగితే… ఎవరైనా పోతే ఇస్తామంటూ ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. పోవడమంటే ఎవరైనా కరోనా రోగి చనిపోవడమో లేక డిశ్చార్జ్ అవ్వడమో.. ఈ రెండింట్లో ఏదో ఒకటి అయితే కానీ.. బెడ్లు ఖాళీ కావని సిబ్బంది చెబుతున్నారు. ఎంత స్పీడ్ గా కరోనా వ్యాప్తి చెందుతోంది అంటే ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రుల్లో చేరినా… వాళ్లు రికవరీ అవుతున్నారన్న నమ్మకం కూడా లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండలేక… ప్రైవేటు ఆసుపత్రల్లో లక్షలు ఖర్చు పెట్టలేక జనాలు అల్లాడిపోతున్నారు.
Corona Second Wave : వెంటిలేటర్లు, ఆక్సీజన్ల కొరతతో పెరుగుతున్న మరణాల రేటు
చాలామంది కరోనా పేషెంట్లు వెంటిలేటర్లు లేక చనిపోతున్నారు. ఆక్సీజన్ అందక, వెంటిలేటర్లు లేక ఊపిరి ఆడక ఎక్కువ మంది చనిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. 100 పడకలు ఉన్న ఆసుపత్రుల్లో కేవలం 10 వెంటిలేటర్లు మాత్రమే ఉంటే… మిగితా వాళ్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కరోనాతో ఆసుపత్రుల్లో చేరాక.. డిశ్చార్జ్ అయ్యేవాళ్ల కంటే… చనిపోయేవారు, పరిస్థితి విషమించే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా శరీరంలో చేరాక.. అది అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని… దీంతో ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోందని వైద్యులు చెబుతున్నారు.
ఇక… సర్కారు ఆసుపత్రుల్లో అన్నింటికీ కొరతే. వెంటిలేటర్లు, బెడ్స్, ఆక్సీజన్… వీటన్నింటికీ కొరత ఉండటం వల్ల… ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి… ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనాకు సంబంధించిన చికిత్స కోసం ఆక్సీజన్, వెంటిలేటర్లు, బెడ్స్ కొరత లేకుండా చూసి ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు.