YS Jagan : కొట్టుకు ఛస్తున్నారు జగనన్నా .. చూస్తున్నవా అసలు పట్టించుకోవా?
YS Jagan : 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. 2019 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటిన జగన్ కు అప్పట్లో వైసీపీ నేతలు చాలా సపోర్ట్ ఇచ్చారు. వైసీపీ నేతలు జగన్ గీతను జవదాటలేదు. మంత్రి వర్గ విస్తరణలో కూడా అప్పట్లో ఎలాంటి అసమ్మతి స్వరాలు వినిపించలేదు కానీ.. ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణను సీఎం జగన్ చేపట్టారో అప్పటి నుంచి వైసీపీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. విభేదాలు ముదురుతున్నాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంటోంది. రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో తమకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన వాళ్లు, తమకు మంత్రి పదవి దక్కకపోయినా మరేదైనా పదవి దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్నవాళ్లు.. అందరూ చాలా నిరాశ చెందారు. దీంతో వైసీపీ నేతల్లో అభద్రతా భావం పెరిగింది. అధిష్ఠానంపై కూడా అసహనం తీవ్రమైంది. వైసీపీ నేతలో అభద్రతా భావం ఒక్క జిల్లాలో కాదు.. రెండు జిల్లాల్లో కాదు.. ఏపీలోని అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి నెలకొన్నది.
YS Jagan : పార్టీ హైకమాండ్ ఎందుకు విభేదాలపై స్పందించడం లేదు?
ఏ జిల్లా చూసుకున్నా అవే విభేదాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎంతో పట్టుంది. గత ఎన్నికల్లో అయితే అన్ని నియోజకవర్గాలో వైసీపీనే గెలిచింది. దీంతో మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి అనేదానిపై జగన్ కు స్పష్టత లేదు. అయితే.. మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్.. ఈ ఇద్దరినీ జగన్ మంత్రివర్గంలోకి తొలుత తీసుకున్నారు. కానీ.. గౌతమ్ రెడ్డి చనిపోవడం, మంత్రివర్గ విస్తరణలో అనిల్ కు పదవి పోవడంతో.. ఒక్కసారిగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రివర్గ విస్తరణలో కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రిగా చాన్స్ వచ్చింది. దీంతో విభేదాలు ఇంకాస్త ముదిరాయి. మంత్రి వర్గ విస్తరణలో అయినా తమకు పదవి వస్తుందని ఆశించిన ఆనం రామ్ నారాయణ్ రెడ్డి, నల్లపురెడ్డి, కోటంరెడ్డితో పాటు అనిల్ అందరూ వర్గాలుగా విడిపోయారు. దీంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.
నెల్లూరుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా కూడా అంతే. ఇక్కడ టీడీపీ గ్రాఫ్ పెంచుకునే పనిలో పడింది. వైసీపీ మాత్రం వర్గపోరుతో రోడ్డు మీద పడిపోతోంది. ఇక్కడ కూడా మంత్రి బాలినేని పదవి పోయింది. ఆదిమూలపు సురేశ్ ను అలాగే ఉంచి.. బాలినేనిని తొలగించడంపై ఆయన చాలా బాధపడినట్టు తెలుస్తోంది. దీంతో ప్రకాశం జిల్లాలోనూ వైసీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. ఇది ఇలా రెండు మూడు జిల్లాలకే పరిమితం కాలేదు. ప్రతి జిల్లాలో ఇదే అసమ్మతి, వర్గపోరు. ఇలా ప్రతి జిల్లాలో వైసీపీ నేతలు కొట్టుకుంటుంటే అధిష్ఠానం మాత్రం ఏం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే.. ఈ నేతలు ఎంత రచ్చ చేసినా.. జనాలు వైఎస్ జగన్ ను చూసి ఓటేస్తారని ముఖ్య నేతలు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ.. అధికార పార్టీలో ఇలా అంతర్గత పోరు ఎక్కువైతే అది వచ్చే ఎన్నికల్లో పార్టీకే తీరని నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి అసమ్మతి నేతలు వర్గపోరు ఎంత దూరం వెళ్తుందో?