GHMC : జీహెచ్ఎంసీ మేయర్ ఎవరి మాటా వినడం లేదా? టీఆర్ఎస్ నేతల మాట అస్సలు వినడం లేదా?
జీహెచ్ఎంసీలో మరోసారి ఎలాగోలా అధికారం దక్కించుకున్న అధికార టీఆర్ఎస్.. ఈసారి మేయర్ పదవిని పార్టీ సీనియర్ నేత, ఎంపీ కే.కేశవరావు కూతురు బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మీకి కట్టబెట్టింది. విజయలక్ష్మీతో పాటు మరికొందరు మహిళా కార్పొరేటర్ల పేర్లు మేయర్ రేసులో వినిపించినా.. సీఎం కేసీఆర్ మాత్రం ఈసారి విజయలక్ష్మికి అవకాశం కల్పించారు. సీనియర్ నేత కే.కేశవరావు రాజకీయ వారసురాలు, ఉన్నత విద్యార్హత కలిగిన విజయలక్ష్మి.. జీహెచ్ఎంసీ మేయర్‌గా తనదైన మార్కు చూపిస్తారని చాలామంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అయితే అసలు విజయలక్ష్మి వ్యవహారశైలి కూడా టీఆర్ఎస్ అధిష్టానానికి మింగుడుపడటం లేదని తెలుస్తోంది.
ఓ సీనియర్ ఐపీఎస్ అధికారితో విజయలక్ష్మి మాట్లాడిన తీరు ఆయనను కలిచివేసిందట. దీంతో ఈ విషయాన్ని ఆయన మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.కార్పొరేటర్లకే కాదు కనీసం ఎమ్మెల్యేలకు, ఎంపీలకూ విషయం చెప్పకుండానే ఆకస్మిక పర్యటనలు, అప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తోందని ఆమెపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారట. ప్రొటోకాల్ ప్రకారం మేయర్ కార్పొరేషన్‌లోని నియోజకవర్గాల్లో పర్యటించేటప్పుడు స్దానిక ఎమ్మెల్యే, కార్పోరేటర్లకు సమాచారం ఉండాలి. కానీ మేయర్ విజయలక్ష్మి షెడ్యూల్‌కు సంబంధించి కార్పొరేటర్లకు విషయం తెలియకుండా కార్యక్రమాలు ముగించేస్తున్నారట. దీంతో కార్పొరేటర్లు మేయర్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. కార్పొరేటర్లే కాదు స్థానిక శాసనసభ్యులు కూడా మేయర్ విజయలక్ష్మి తీరుపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
అధికారులతోనూ.. GHMC
జీహెచ్‌ఎంసీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు తాను వచ్చేవరకు చేయొద్దంటూ విజయలక్ష్మి హుకుం జారీచేశారట. దీంతో ఎమ్మెల్యేలు సైతం గుర్రుగా ఉంటున్నారట. మేయర్‌కు, బల్దియా అధికారులకు మధ్య సమన్వయం కొరవడిందని జీహెచ్ఎంసీ సిబ్బంది అనుకుంటున్నారట. ఇటీవల కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో మేయర్‌కు తెలియకుండా కొన్ని ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేసిన ఇంజినీర్లపై సీరియస్ అయ్యారట. సంబంధిత అధికారులకు మోమోలు కూడా జారీ చేశారు.
ఇక కమిషనర్ లోకేష్ కుమార్ సైతం మేయర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారట.ఎల్బీనగర్ జోన్ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాల్లో విజయలక్ష్మీ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఆరోగ్య పరిరక్షణ కోసం పీపీఈ కిట్లను పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ ఏ ఒక్క కార్యక్రమానికి కూడా కమిషనర్ హాజరుకాలేదు. ఇలా మేయర్ కార్యక్రమాలకు సంబంధించి కమిషనర్‌కు సమాచారం లేకపోవడం, కమిషనర్ సైతం దూరంగా ఉండటం చూస్తుంటే ప్రథమ మహిళ ఎవరిని కలుపుకొని వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. మేయర్ పర్యటన అంటేనే అయోమం గందరగోళం అని అధికారులు చెప్పుకుంటున్నారంట.
కేకే దృష్టి.. GHMC
నగరానికి చెందిన ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా విజయలక్ష్మి తన సన్నిహితుల విషయంలో తీసుకున్న ఓ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఈ విషయాన్ని ఆయన మంత్రి కేటీఆర్‌కు వివరించారని తెలుస్తోంది. విజయలక్ష్మి తీరుపై అటు అధికారులు, ఇటు టీఆర్ఎస్ నేతల నుంచి ఫిర్యాదులు రావడంపై స్పందించిన మంత్రి కేటీఆర్.. దీనిపై పార్టీ సెక్రటరీ జనరల్, విజయలక్ష్మి తండ్రి కే. కేశవరావుతో చర్చించారని తెలుస్తోంది. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని.. విజయలక్ష్మి వ్యవహారశైలి మారేలా చూడాలని ఆయన కేకేను కోరారని సమాచారం.
అయితే దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టిన టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు.. జీహెచ్ఎంసీ అంశాలపై తాను స్వయంగా దృష్టి పెట్టారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో మేయర్ తీసుకునే నిర్ణయాలను కేశవరావు ముందుగానే సమీక్షిస్తున్నారని.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది. కేకే స్వయంగా రంగంలోకి దిగి నిర్ణయాలు తీసుకుంటుండటంతో.. టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఈ విషయంలో కూల్ అయినట్టు సమాచారం.