Revanth Reddy : ఇట్లయితే ఎట్లా? రేవంత్ రెడ్డి కోరుకున్న పదవి దక్కేనా? ఒకవేళ అలా జరిగితే కష్టమేనా?
కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటిది కాదు. పాత పార్టీ కదా. అందులోనూ పార్టీలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అంతే ఈజీగా జరిగే పని కాదు. దాని కోసం చాలా సమీకరణలు చూసుకోవాలి. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకోవడం కోసం సంవత్సరాలకు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీలో.
సేమ్.. తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కూడా అదే జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత సంవత్సరమే రాజీనామా చేశారు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్ నే ఎన్నుకోలేదు.
జానారెడ్డి చెప్పడం వల్లనేనా?
అయితే.. తెలంగాణలో త్వరలో మరో ఉపఎన్నిక జరగబోతోంది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ సమయంలో టీపీసీసీ చీఫ్ ను ప్రకటించడం కంటే.. ఉపఎన్నిక పూర్తయ్యాక టీపీసీసీ చీఫ్ గురించి ఆలోచించడం బెటర్ అని సాగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అధిష్ఠానానికి సూచించినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖాయం అనే వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి ఈ విషయంపై కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ పదవి కోసం ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తమ్ రాజీనామా చేయగానే.. తనకు టీపీసీసీ చీఫ్ పదవి దక్కుతుందనుకున్నారు. అలాగే.. అధిష్ఠానం కూడా రేవంత్ వైపే మొగ్గు చూపింది. కానీ.. త్వరలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఉండటంతో.. ప్రస్తుతానికి టీపీసీసీ చీఫ్ ఎన్నిక ప్రక్రియను వాయిదా వేశారట.
పోనీ.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తయ్యాక అయినా టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికే అప్పగిస్తారా? అనేదానిపై క్లారిటీ లేదు. అది పూర్తిగా సాగర్ ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది.
అలాగే.. అప్పటి సమీకరణలను, అప్పటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని కూడా మళ్లీ టీపీసీసీ చీఫ్ ను ఎన్నుకునే అవకాశం ఉంది. దీంతో రేవంత్ రెడ్డికి కొంచెం టెన్షన్ మొదలైందనే చెప్పాలి. ఏది ఏమైనా.. ఇంకొన్ని నెలలు మాత్రం రేవంత్ రెడ్డి వెయిట్ చేయాల్సిందే. అప్పుడు కూడా అధిష్ఠానం రేవంత్ నే టీపీసీసీ చీఫ్ గా ప్రకటిస్తే ఓకే కానీ.. వేరే పేరును పరిగణనలోకి తీసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డికి చుక్కెదురు అయ్యే అవకాశం ఉంది. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో?