Doctor Preethi : 50 లక్షల అగ్రిమెంట్ పై సంతకం .. ఇదే ప్రీతి మరణానికి కారణం !!
Doctor Preethi : వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాలకు చెందిన ప్రీతి మత్తు ఇంజక్షన్ తీసుకొని సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈనెల 22న మత్తు ఇంజక్షన్ తీసుకున్న ప్రీతి ఐదు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఆదివారం మృతి చెందారు. దీంతో ప్రీతి మరణం పై షాకింగ్ విషయాలు బయటకి వస్తున్నాయి. ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ప్రీతి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు విలపించారు. ప్రీతి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ప్రీతి సొంత ఊరులో అంత్యక్రియలు జరిగాయి. ఇప్పటికే ప్రీతి కేసులో అనేక ట్విస్టులు బయటికి వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రీతి కేసులో మరొక వార్త వినిపిస్తోంది.
వైద్య విద్యలో సీటు వచ్చిన సమయంలో అడ్మిషన్ బాండ్ 50 లక్షల అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఏవైనా కారణాలతో మధ్యలో డ్రాప్ అయితే ఆ 50 లక్షలు కాలేజీకి చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది యూనివర్సిటీ మెడికల్ పీజీ సీటు మధ్యలో వదులుకుంటే 20 లక్షలు కట్టాల్సి ఉంటుందనే నిబంధన ఉండేది. అయితే చాలామంది వైద్య విద్యార్థులు మధ్యలోనే డ్రాప్ ఐపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది మొత్తాన్ని 50 లక్షలు పెంచింది. దీంతో చాలామంది విద్యార్థులు కాలేజీ వదిలి వెళ్ళేందుకు ధైర్యం చేయట్లేదని కొందరు అంటున్నారు. అలాగే వేధింపులు, ర్యాగింగ్ ఇతరత్రా సమస్యలు ఉన్న పీజీ పూర్తి చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదే విషయం ప్రీతికి జరిగిందని అంటున్నారు. సైఫ్ నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో సీటు వదిలేయమని ప్రీతి తండ్రి నరేందర్ చెప్పారు. ఆ సమయంలో ప్రీతి చాలా వేదనకు గురైందని సమాచారం. 50 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది కదా అన్ని డబ్బులు ఎలా ఇవ్వగలం అని ఆమె చివరి మాటల్లో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణం తోనే ప్రీతి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వేధింపులు, ర్యాగింగ్ లపై చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం కొత్త అడ్మిషన్ బాండ్ నిబంధనలు తీసుకురావాలని లేదా విద్యార్థులకు న్యాయం జరిగేలా చేయాలని తల్లిదండ్రులు అంటున్నారు.