Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమయానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క కాటు తర్వాత రేబిస్ వ్యాధితో మృతి చెందింది. కేవలం తెలియని భయంతో కుక్క కరిచిన విషయం తల్లిదండ్రులకు చెప్పకపోవడంతో ఈ ఘటన జరిగింది.
#image_title
నెల రోజుల క్రితం కుక్క కాటు
సమాచారం ప్రకారం, దాదాపు నెల రోజుల క్రితం ఒక వీధి కుక్క లక్ష్మణపై దాడి చేసి తలకు గాయపరిచింది. ఆ సమయంలో చిన్న గాయమని భావించిన ఆమె, ఇంట్లో మందలిస్తారేమోనని భయపడి తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే ఆ గాయం ద్వారా రేబిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశించి నెమ్మదిగా ప్రాణాంతక స్థాయికి చేరుకుంది.
మూడు రోజుల క్రితం బాలిక ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. కుక్కలా మొరగడం, నీటిని చూసి భయపడటం వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా, అప్పటికే ఆలస్యమైపోయింది. వైద్యులు ఆమెకు రేబిస్ వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపించిందని నిర్ధారించారు. చికిత్స పొందుతూ లక్ష్మణ చివరకు మృతి చెందింది.
ఈ ఘటనపై వైద్యులు ప్రజలను అప్రమత్తం చేశారు.
“కుక్క కాటు చిన్న గాయంగా కనిపించినా అది ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధికి దారితీసే ప్రమాదం ఉంది. కుక్క కరిచిన వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే రేబిస్ వ్యాక్సిన్ (Vaccine) తీసుకోవాలి,” అని వైద్యులు హెచ్చరించారు.