KCR – YS Jagan : ముందస్తు ఎన్నికలపై కేసీఆర్, జగన్‌కి పీకే ఏం చెప్పారు.?
KCR – YS Jagan : తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు రావొచ్చంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతున్నా, ‘మేమెందుకు ముందస్తు ఎన్నికలకు వెళతాం.?’ అని తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు కుండబద్దలుగొట్టేస్తున్నాయి. అయితే, తెరవెనుకాల కథ మాత్రం వేరేలా వుంటోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా వుండాలంటూ పార్టీ శ్రేణులకు అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం చేసేస్తున్నారు. ఈ రెండు పార్టీలకీ ఒకరే రాజకీయ వ్యూహకర్త వున్నారు. ఆయనే ప్రశాంత్ కిషోర్. 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు వైసీపీతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితికీ పని చేస్తున్నారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా, తమ పార్టీకీ ప్రశాంత్ కిషోర్ సేవలందిస్తారని చెబుతున్నా, పీకే నుంచి మాత్రం ఈ విషయమై స్పష్టత లేదు. తెలుగు రాష్ట్రాల్లో పీకే టీమ్ విస్తృతంగా పనిచేస్తోంది.. సర్వేలు కూడా నిర్వహిస్తోంది. ఆయా సర్వేలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, నివేదికలూ తయారు చేసి.. అటు వైసీపీకీ, ఇటు టీఆర్ఎస్‌కీ అందిస్తోంది. ఈ నివేదికల్ని ఆయా పార్టీలు విశ్లేషించుకుంటున్నాయి. తాజాగా పీకే టీమ్ ఇచ్చిన నివేదికల్లో ముందస్తు ఎన్నికల ఆవశ్యకత గురించి స్పష్టంగా పేర్కొన్నారట ప్రశాంత్ కిషోర్.
ఇప్పటికిప్పుడు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనీ, ముందు ముందు వ్యతిరేకత వచ్చే అవకాశం వుందనీ, ముందస్తు ఎన్నికలకు వెళ్ళడమే మంచిదని ప్రశాంత్ కిషోర్ అటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, ఇటు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకీ సూచించినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ అంచనాలు అస్సలు తప్పవు. ఆయనకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. ఆ విషయం 2019 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, ఆ విజయాన్ని కళ్ళారా చూసిన కేసీయార్‌కీ బాగా తెలుసు. ఈ ఏడాది చివరి లోపు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ఉత్తమమని ప్రశాంత్ కిషోర్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారట.