Etela Rajender : ‘టీఆర్ఎస్ దాడి నుంచి తప్పించుకోవడానికే బీజేపీలో చేరుతున్న ఈటల’
Etela Rajender : ఈటల రాజేందర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఆదివారమే ఢిల్లీకి వెళ్లారు. అక్కడే ఇంకా కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ తో పాటు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ లు కూడా ఢిల్లీకి వెళ్లారు. వీళ్లంతా కలిసి సోమవారం బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఈటల రాజేందర్.. జేపీ నడ్డాతో పార్టీలో చేరే విషయం గురించి చర్చించినట్టు తెలుస్తోంది.
పార్టీలోకి వస్తే.. మంచి స్థానం ఇస్తామని జేపీ నడ్డా.. ఈటలకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒక్కటే అన్న ఉద్దేశంలో ప్రజలు ఉన్నారని.. అలా ఉండకుండా.. టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేలా.. బీజేపీ వ్యవహరించాలని.. టీఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఈసందర్భంగా ఈటల రాజేందర్.. నడ్డాతో చెప్పినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. తెలంగాణలో 2023 లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే రాజకీయ పోరు.. అని నడ్డా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
Etela Rajender : పార్టీలో చేరే విషయమై త్వరగా నిర్ణయం తీసుకోండి
అయితే.. బీజేపీలో చేరే విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈటల రాజేందర్ కు నడ్డా తెలిపినట్టు సమాచారం. సుమారు గంట భేటీ తర్వాత.. త్వరలోనే పార్టీలో చేరే విషయంపై నిర్ణయం తీసుకుంటానని ఈటల రాజేందర్.. నడ్డాకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు తెలంగాణ వ్యాప్తంగా గుప్పుమనడంతో.. చాలా మంది నేతలు స్పందిస్తున్నారు. జూన్ 2 నే ఆయన పార్టీలో చేరుతారనే వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే ఢిల్లీ వెళ్లారని… పార్టీలో చేరిన తర్వాతనే తిరిగి తెలంగాణకు వస్తారనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ దాడి నుంచి తప్పించుకోవడం కోసమే ఈటల రాజేందర్ బీజేపీ వైపు చూస్తున్నారని.. కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసమే ఆయన ఢిల్లీ వెళ్లారని.. ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు.