Guava | జామ పండు నుండి కాలేయ క్యాన్సర్‌కు ఔషధం? ..డెలావేర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సెన్సేషన్
Guava | జామ పండు రుచికరమైన పండు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో మేలులు చేస్తుందని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. తాజాగా అమెరికాలోని డెలావేర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఈ సాధారణ పండు ప్రాణాంతక వ్యాధి అయిన కాలేయ క్యాన్సర్ చికిత్సలో కూడా కొత్త మార్గం చూపగలదని వెల్లడించింది.

#image_title
అధ్యయనంలో వెలుగులోకి వచ్చిన విషయాలు
డెలావేర్ విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ విలియం చెన్ బృందం ఈ పరిశోధన చేపట్టింది. జామ మొక్కల నుండి తీసుకున్న ప్రత్యేక అణువులను ఉపయోగించి కాలేయ క్యాన్సర్ చికిత్సకు వినియోగించే “సహజ ఉత్పత్తి మొత్తం సంశ్లేషణ” పద్ధతిని అభివృద్ధి చేశారు.ఈ సాంకేతికత ద్వారా జామపండు అణువులను తక్కువ ఖర్చుతో, పెద్ద ఎత్తున ప్రయోగశాలలో పునఃసృష్టించడం సాధ్యం అవుతుంది.
ఇప్పటి వరకు కాలేయ క్యాన్సర్ చికిత్సలు ఖరీదైనవే కాక, ఫలితాలు కూడా తక్కువే. కొత్త పద్ధతి ద్వారా చికిత్స చౌకగా మరియు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మొక్కల నుండి నేరుగా ఎక్కువ మొత్తంలో అణువులు సేకరించాల్సిన అవసరం ఉండదు. ప్రయోగశాలలోనే వీటిని తయారు చేయవచ్చు. జామ అణువులు కాలేయం, పిత్త వాహిక క్యాన్సర్‌లపై ప్రభావవంతంగా పనిచేసే అవకాశముందని పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కాలేయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. తరువాతి దశలలో నివారణ రేటు కేవలం 15% మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.