Heavy Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం.. వినాయక కమిటీలకి ప్రత్యేక సూచనలు
Heavy Rains | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల సూచన ఇచ్చారు. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

#image_title
జాగ్రత్తలు తప్పనిసరి..
ముఖ్యంగా కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే సూచన ఉంది. ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
తీరం వెంబడి 40–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి సందర్భంగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉత్సవ మండపాలు ఏర్పాటయ్యాయి. భారీ వర్షాల కారణంగా వాటి నిర్వహణలో సురక్షిత చర్యలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రోడ్లు, నీటి ప్రవాహాలు, తక్కువ ప్రాంతాల్లోకి నీటి చేరికలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, ప్రజలు ప్రభుత్వ సూచనల్ని పాటిస్తూ సురక్షితంగా ఉండాలి.