Epass Telangana : లాక్ డౌన్ టైమ్ లో ట్రావెల్ చేయడానికి ఈ పాస్ కావాలంటే ఏం చేయాలి? ఎలా అప్లయి చేయాలి?
Epass Telangana : తెలంగాణలో ఈ రోజు నుంచి అంటే మే 12 నుంచి లాక్ డౌన్ అమలులో ఉండనుంది. మే 12 నుంచి మే 22 వరకు లాక్ డౌన్ ఉండనుంది. కేవలం ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు మాత్రమే బయటికి వెళ్లి కావాల్సిన వస్తువులను కొనుక్కోవాలి. మిగితా సమయాల్లో బయటికి వెళ్లడానికి వీళ్లేదు. ఉదయం 6 నుంచి 10 వరకు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు కానీ.. ఉదయం 10 దాటితే మాత్రం ప్రయాణం చేయడానికి వీలు లేదు. ఉదయం 10 దాటగానే ఎక్కడివాళ్లు అక్కడే ఇంట్లోకి వెళ్లిపోవాలి. ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. అయితే.. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో బయటికి వెళ్లాలనుకునేవాళ్లు, వేరే ఊళ్లకు వెళ్లేవాళ్లు మాత్రం.. సంబంధింత ఈపాస్ ను తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. వేరే జిల్లాలకు వెళ్లాలన్నా.. వేరే రాష్ట్రాలకు వెళ్లాలన్నా.. ఖచ్చితంగా ఈపాస్ ఉండాల్సిందే.
ఈ పాస్ విధానం ద్వారా.. వేరే ప్రాంతాలకు వెళ్లే వాళ్లకు ప్రత్యేక పాసులను ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తెలంగాణ పోలీస్ శాఖ జారీ చేస్తుంది. https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ ఈ పాస్ కోసం అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది. లాక్ డౌన్ సడలింపు సమయంలో కాకుండా.. ఇతర సమయాల్లోనూ ప్రత్యేక పాసుల సాయంతో ప్రయాణించవచ్చు.
ఇతర రాష్ట్రాలకు వెళ్లేవాళ్లు, ఇతర జిల్లాలకు వెళ్లే వాళ్లకు.. వాళ్ల ప్రాంతాలకు చెందిన పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాస్ లను జారీ చేస్తారు. అలాగే.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వాళ్లకు.. ఆయా రాష్ట్రాల నుంచి పాస్ తీసుకొని తెలంగాణలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి సంబంధిత రాష్ట్ర పాస్ లేకుండా తెలంగాణలో అడుగుపెడితే.. పోలీసులు తెలంగాణలోకి రానివ్వకుండా అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
Epass Telangana : లాక్ డౌన్ సడలింపు సమయంలో ఎటువంటి పాస్ అవసరం లేదు
లాక్ డౌన్ సడలింపు అయిన ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు ఎటువంటి పాస్ అవసరం లేకుండానే ప్రయాణం చేయొచ్చని పోలీసులు తెలుపుతున్నారు. వేరే ప్రాంతానికి ప్రయాణించాలనుకునే వాళ్లు.. ప్రస్తుతం వాళ్లు ఉన్న ప్రాంతంలో ఏ కమిషనరేట్ పరిధికి వస్తుందో ఆ కమిషనరేట్ నుంచే పాసులను జారీ చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా.. బయటి రాష్ట్రాలకు వెళ్లాలన్నా.. ఖచ్చితంగా పైన పేర్కొన్న వెబ్ సైట్ ద్వారానే అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఈపాస్ ను జారీ చేస్తారు. ఈ పాస్ ను ప్రయాణం చేసేటప్పుడు దగ్గర పెట్టుకొని.. పోలీసులు అడిగితే చూపించాల్సి ఉంటుంది.