Korameenu Fish Recipe : కుండలో కొరమీను చేపల ఇగురు కూర చేస్తే… ఆహా.. మధురమే.
Korameenu Fish Recipe : ఫిష్ కర్రీ అంటే ఇష్టముండని వాళ్లు ఉండరు. చింత పులుసు వేసి చేపల కూర చేస్తే… ఆహా.. మధురమే. చాలా మంది ఇలా చేపల కూరను చేసే ఉంటారు. అయితే ఇప్పుడు కొరమీను చేపల ఇగురు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు కొరమీను చేప ముక్కలు ఉల్లిపాయ వెల్లుల్లి కారం గరం మసాలా మెంతులు కరివేపాకు చింతపండు తాజా కొరమీను చేప తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు వేసి చక్కగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో చేప ముక్కులు మునిగేంత నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. రెండు పెద్ద సైజ్ నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు నీటిలో నాన బెట్టు కోవాలి.
తర్వాత గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉల్లి పాయలు వేసి మెత్తని పేస్టుగా తయారు చేసుకోవాలి. తర్వాత మిక్సీలో మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఎండుమిర్చి వేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి. కొన్ని పచ్చి మిర్చి తీసుకుని సగానికి, మధ్యలో కోసి పక్కన పెట్టుకోవాలి. మట్టితో చేసిన పాత్రను తీసుకుని చక్కగా నీటితో కడుక్కుని.. దానిని 15 నిమిషాల వరకు వేడి చేసుకోవాలి. తర్వాత నూనె పోసి వేడి చేసుకోవాలి. కొన్ని మెంతులు తీసుకుని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చి మిర్చి వేసుకుని వేయించుకోవాలి. తర్వాత పెద్దగా తరిగి పెట్టుకున్న ఉల్లి పాయలు, అలాగే ముందుగా పేస్టుగా చేసి పెట్టుకున్న పేస్టు వేసి వేయించుకోవాలి.
అవి బాగా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. పసుపు వేసుకుని కలుపు కోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా వేసుకుని బాగా ఉడకించుకోవాలి. తర్వాత గల్లు ఉప్పు, కారం వేసుకోవాలి. గరం మసాలా వేసి కలపాలి.నీళ్లలో నాన బెట్టుకున్న కొరమీను చేప ముక్కలను వేసుకోవాలి. తర్వాత చింత పండు రసం వేసుకుని చెంచా పెట్టకుండానే మట్టి పాత్రను అటు ఇటు కదుపుకోవాలి. కూర పూర్తి అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెంచా పెట్టకూడదు. చక్కగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి. చేపల కూర వేడిగా ఉన్నప్పుడు కంటే కూడా చల్లగా అయ్యాక రుచి అదిరిపోద్ది.