Mutton Fry : నోరూరించే మటన్ ఫ్రై.. చూపులకే కాదండోయ్ రుచిలోనూ అదుర్స్!
Mutton Fry : చాలా మందికి మాంసాహారం లేనిదే ముద్ద దిగదు. వారానికి రెండు మూడు సార్లు అయినా చికెన్, మటన్ లను లాగించేస్తుంటారు. అయితే తరచుగా నాన్ వెజ్ తినే వాళ్లకు అందులో కొత్త కొత్త వెరైటీలు కావాలనుకుంటారు. అందులోనూ మటన్ లో వెరైటీ స్టైల్ వంటకాలను తినేందుకు మరింత ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే క్రంచీ క్రంచీగా ఉండే మటన్ ఫ్రైని… మస్తు మస్తుగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సరిగ్గా చేయాలే కాని దీని రుచి మరే వంటకానికి రాదనుకోండి. అయితే ఈ మటన్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు.. బోన్ లెస్ మటన్ – పావు కిలో, మరియారు – ఒక టీ స్పూన్, లవంగా – 4, దాల్చిన చెక్క ఒకటి, 3 యాలకులు, అర టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ దనియాలు, వ8 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా తరిగిన కొత్తిమీర, నూనె తగినంత. ముందుగా ఒక పాన్ లో మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, దనియాలు, యాలకులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. అవి చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పడు అదే పెనంలో నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
ఇవి వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. ఇవి వేగాక కడిగిన మటన్, తగినంత ఉప్పు వేసి కలిపుకొని మూత పెట్టాలి. 15 నమిషాలు ఉడికాక కారం పొడి వేసుకొని మరో 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మటన్ ఉన్న నీరుంతా పోయి మటన్ పూర్తిగా ఉడికే వరకు వేయించుకోవాలి. మటన్ పూర్తిగా వేగిన తర్వాత.. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసి కలిపి మరో 3 నిమిషాలు పాటు ఉంచి చివరగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ ఫ్రై తయారవుతుంది. మీరూ ఓ సారి ట్రై చేయండి మరి.