Crime News | మేడిపల్లిలో అమానుష ఘటన..గర్భవతిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసిన భర్త
Crime News | హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి ప్రాంతంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బాలాజీ హిల్స్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి తన గర్భవతి భార్యను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు ముక్కులగా నరికిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (25), మహేందర్ అనే యువకుడిని ప్రేమించి కొంతకాలం క్రితం పెళ్లి చేసుకుంది.
మరీ ఇంత దారుణమా?
వివాహం అనంతరం ఈ దంపతులు బోడుప్పల్ ప్రాంతంలోని బాలాజీ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. తరచూ గొడవలు జరుగుతుండగా, చివరకు మహేందర్ తన భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం… శనివారం మధ్యాహ్నం మహేందర్ తన భార్య స్వాతిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు.
తల, చేతులు, కాళ్లను వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. ఛాతీ భాగాన్ని కవర్‌లో పెట్టి గదిలోనే దాచినట్లు గుర్తించారు. మేడిపల్లి పోలీసులు సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన భార్యను హత్య చేసిన విషయాన్ని మహేందర్ అంగీకరించాడు. హత్యకు గల కారణంగా కుటుంబ సమస్యలేనా, కట్న వేధింపులా లేక మరేదైనా వ్యక్తిగత కారణమా అన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. మృతదేహం మిగతా భాగాల కోసం గాలింపు కొనసాగుతోంది.