Sonia Gandhi : ఈడీ విచారణ.! సోనియా గాంధీకి ఏమైనా జరగకూడనిది జరుగుతుందా.?
Sonia Gandhi : ఏదో మిన్ను విరిగి మన మీద పడిపోయిందన్నట్లు తయారైంది వ్యవహారం. లేకపోతే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచినంతనే కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించడంలో అర్థమేంటి.? మొన్న రాహుల్ గాంధీ, తాజాగా సోనియా గాంధీ.. ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు గందరగోళం సృష్టించాయి. దేశంలో ఈడీ కావొచ్చు, సీబీఐ కావొచ్చు, ఎన్ఐఏ కావొచ్చు.. రాష్ట్రాల పరిధిలో సీఐడీ కావొచ్చు, ఏసీబీ లాంటి దర్యాప్తు సంస్థలు కావొచ్చు.. ఇవి నమోదు చేసే కేసులు, వీటి విచారణ తీరు.. వీటి పట్ల ప్రజలకు ఓ అవగాహన వుంది. రాజకీయ కోణంలో నమోదైన కేసుల్లో విచారణ సుదీర్ఘ కాలం పాటు సాగతీతకు గురవుతుటుంది.
ఈ విషయం కాంగ్రెస్ పార్టీ కంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది.? దేశంలో కాంగ్రెస్ అధికారంలో వున్న సమయంలోనే, ‘సీబీఐ అంటే పంజరంలో చిలక’ అని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడేలా పరిస్థితులున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితి ఇంకాస్త దిగజారిందంతే. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ తాజాగా ఈడీ యెదుట విచారణకు హాజరయ్యారు. గతంలోనే ఆమె విచారణకు హాజరు కావాల్సి వున్నా, అనారోగ్య కారణాలతో ఆమె ఆసుపత్రిలో వుండడం వల్ల అది వీలు పడలేదు. ఈ కేసులో రాహుల్ గాంధీ ఇప్పటికే కొన్ని రోజుల పాటు వరుసగా ఈడీ యెదుట విచారణకు హాజరయ్యారు.
సోనియా, తాజాగా విచారణకు హాజరయ్యారు.. మూడు గంటల విచారణ అనంతరం ఆమె ఈడీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. ఆమె వెంట ప్రియాంకా గాంధీ కూడా వున్నారు. మరోమారు ఈడీ, సోనియా గాంధీని విచారించే అవకాశం వుంది. ఈ నెల 25న హాజరు కావాలంటూ ఈడీ, సోనియా గాంధీకి సూచించారట. జరుగుతున్న రాజకీయ రచ్చవల్ల కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ మైలేజ్, ఆ పార్టీ పట్ల జనంలో సింపతీ పెరగడం తప్ప.. సోనియా గాంధీకి ఈ కేసు వల్ల కలిగే నష్టమేమీ లేదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.