Komatireddy : తెలంగాణ కాంగ్రెస్‌లో ‘కోమటిరెడ్డి’ పంచాయితీ.!
Komatireddy : కాంగ్రెస్ పార్టీలో వుండలేకపోతే, నిస్సంకోచంగా పార్టీకి గుడ్ బై చెప్పేయొచ్చు. కానీ, ఆపని ఆయన చేయడంలేదు. కాంగ్రెస్ పార్టీని కుళ్ళబొడిచే పనిలో బిజీగా వున్నారాయన. ఆయన ఎవరో కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఆయన పారిశ్రామిక వేత్త కూడా. సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతగల నాయకుడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్లలో ఒకరు. కానీ, ఏం లాభం.? ఆయనకూ పార్టీలో తగిన గౌరవం దక్కడంలేదు. పీసీసీ అధ్యక్ష పదవిపై కన్నేసినా, అది దక్కకపోవడంతో ఒకింత డీలా పడ్డారు. అడపా దడపా కాంగ్రెస్ పార్టీ మీద సెటైర్లేస్తుంటారు.
మరీ ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేసే సెటైర్లు అన్నీ ఇన్నీ కావు. ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయానికొస్తే, ఆయన కాంగ్రెస్ పార్టీలో వున్నారో లేదో ఆయనకే తెలియదు. ఓసారి తాను కాంగ్రెస్ నేతనంటారు, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటిస్తారు. తాజాగా ఆయన బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బీజేపీలోకి వెళ్ళిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు కూడా. ఇంతలోనే, మాట మార్చారు. తన మీద ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు.
అమిత్ షాతో భేటీ కేవలం మర్యాదపూర్వకమేనని సెలవిచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇంకోపక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానమివ్వాలంటూ కాంగ్రస్ పార్టీలో హనుమంతరావు లాంటి సీనియర్లు గళం విప్పుతున్నారు. ఇది తెగే పంచాయితీ కాదు. అసలు కాంగ్రెస్ పార్టీకి వేరే శతృవులే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి కాంగ్రెస్ నేతలే సరిపోతారు. ఆ పనిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటోళ్ళు ఎప్పటికప్పుడు విజయవంతంగా చేసేస్తుంటారు కూడా.