YSRCP : ఆ ఎమ్మెల్యేలను మించి పోయిన వారి వారసులు.. అక్కడ వాళ్లదే రాజ్యం? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP : ఆ ఎమ్మెల్యేలను మించి పోయిన వారి వారసులు.. అక్కడ వాళ్లదే రాజ్యం?

 Authored By sukanya | The Telugu News | Updated on :30 July 2021,11:30 am

YSRCP : కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఆ నాలుగు నిజయోగకవర్గ ఎమ్మెల్యేల కంటే వారి వారసులే రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. భవిషత్తులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ సుపుత్రులను బరిలో దించి గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించి.. ఓ పద్ధతి ప్రకారం కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ముందు వరుసలో ఉన్నారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి. తన సుపుత్రుడిని ఎమ్మెల్యేగా చూడాలన్న కల సాకారం చేసుకొనేందుకు జయమనోజ్‌ రెడ్డిని రాజకీయ వారసుడిగా నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేసేశారు. నియోజకవర్గంలో అన్ని అంశాల్లోను జయమనోజ్ రెడ్డి తనదైన శైలిలో చొరవ చూపిస్తున్నారు. ఎమ్మెల్యే కొడుకుగా అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేస్తూ సలహాలు ఇచ్చేస్తున్నారు. ఆదోని మున్సిపల్‌ ఎన్నికల్లో వ్యూహాలన్నీ సాయి మనోజ్‌రెడ్డి రూపకల్పన చేసినట్లు సమాచారం. భారీ మెజారిటీతో 42 మంది కౌన్సిలర్ల గెలుపుకు కీలక పాత్ర పోషించారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఇదంతా చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో సాయి ప్రసాద్‌రెడ్డి తనయుడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారేమోనని పార్టీ క్యాడర్ లో బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.

kurnool ysrcp mlas sons into active politics

kurnool ysrcp mlas sons into active politics

మంత్రాలయం, పాణ్యం, ఎమ్మిగనూరు..

ఇక మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా సాయిప్రసాద్ రెడ్డి మార్గాన్ని ఎంచుకున్నారు. తన తరువాత రాజకీయ వారసునిగా అన్న కుమారుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డిని రంగంలో దింపుతున్నట్లు సమాచారం. బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీరెడ్డి ఉన్నా.. యాక్టివ్‌ రోల్‌ మాత్రం ప్రదీప్‌కుమార్‌రెడ్డి దేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రదీప్‌కుమార్‌రెడ్డితో చర్చించకుండా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ముందడుగు వేయడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో 2024లో బాలనాగిరెడ్డి ప్లేస్‌లో ప్రదీప్‌రెడ్డి పోటీ చేస్తారేమోనని పార్టీ క్యాడర్ చెప్పుకుంటున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తన రాజకీయ వారసునికి త్వరలో పట్టంగట్టాలని చూస్తున్నారని కేడర్ చెబుతోంది. కుమారుడు నరసింహారెడ్డితో పలు గ్రామాల్లో గ్రామప్రజల సమస్యల పరిష్కారంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన కుమారుడు జగన్‌ మోహన్‌రెడ్డిని రాజకీయాల్లో అరంగేట్రం కోసం తెగ ఆరాట పడిపోతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దించాలని చూశారు. అయితే పార్టీ అధిష్టానం ఇందుకు ససేమిరా అనడంతో వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఎమ్మిగనూరులో జగన్‌మోహన్‌రెడ్డి తీరిక లేకుండా పర్యటిస్తూ బలం తగ్గకుండా చేసుకుంటున్నారు.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది