Central New Bill : అరెస్ట్ అయితే సీఎం అయినాసరే పదవి కోల్పోవాల్సిందే – మోడీ సంచలన వ్యాఖ్యలు
Central New Bill : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవినీతిని అరికట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లులకు బలమైన మద్దతు తెలిపారు. బీహార్‌లోని గయాజీలో జరిగిన సభలో మాట్లాడుతూ.. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి 50 గంటలపాటు జైలులో ఉంటే ఉద్యోగం కోల్పోతాడని, కానీ ఒక సీఎం, మంత్రి లేదా ప్రధాని జైలులో ఉన్నప్పటికీ పదవిలో కొనసాగడం ఎలా న్యాయం అవుతుందని ప్రశ్నించారు. చట్టం ముందు ఎవరూ మినహాయింపు కాదని, కొత్త బిల్లుల ప్రకారం ప్రధాని కూడా ఆ పరిధిలోకి వస్తారని మోడీ స్పష్టం చేశారు.
modi speech Central New Bill
ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేసును పరోక్షంగా ప్రస్తావించారు. మద్యం స్కాం కేసులో జైలులో ఉండి కూడా ప్రభుత్వ ఆదేశాలకు సంతకాలు చేసిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి ఎలా ఆగుతుందని ప్రశ్నించారు. అందుకే కొత్త చట్టం అవసరమైందని మోడీ వివరించారు. కేజ్రీవాల్ చివరికి సుప్రీంకోర్టు బెయిల్ మీద బయటకు వచ్చాకే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని, 2025 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.
మోడీ ప్రస్తావించిన మూడు ముఖ్యమైన బిల్లులు – రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు, యూనియన్ టెరిటరీస్ (అమెండ్‌మెంట్) బిల్లు, జమ్ము కాశ్మీర్ రీఆర్గనైజేషన్ (అమెండ్‌మెంట్) బిల్లు. వీటిలో ప్రధానంగా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు వరుసగా 30 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉండి బెయిల్ రాకపోతే వారి పదవి ఆటోమేటిక్‌గా రద్దవుతుందని ప్రతిపాదించారు. ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష ఉన్న నేరాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రతిపక్షం మాత్రం ఈ బిల్లులను రాజ్యాంగ విరుద్ధమని విమర్శించింది. అయితే చర్చల అనంతరం వీటిని తిరిగి సభ ముందు ఉంచుతామని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.