Telangana: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి వివరాలు ఇవే..!
ప్రధానాంశాలు:
Telangana: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి వివరాలు ఇవే..!
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అధికారికంగా విడుదల చేశారు. షెడ్యూల్ విడుదలకు ముందు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణపై సమగ్ర చర్చ జరిపారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కమిషన్ ప్రకటించింది. దీంతో అభివృద్ధి పనులు కొత్త నిర్ణయాలపై పరిమితులు అమలులోకి వచ్చాయి.
Telangana: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి వివరాలు ఇవే..!
Municipal Elections : నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్ వరకు పూర్తి వివరాలు
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. జనవరి 31న నామినేషన్ల పరిశీలన చేపడతారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 11న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ని ర్వహించనున్నారు. పోలింగ్ పూర్తైన రెండు రోజుల తర్వాత ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. అలాగే కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు, మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇవి వచ్చే నెల 16వ తేదీన జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల్లో పాలన పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది.
Municipal Elections : భద్రత, ఓటర్ల సంఖ్య, ప్రత్యేక నిబంధనలు
ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 130 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ పరిపాలనా మరియు ఇతర కారణాల వల్ల 116 మున్సిపాలిటీలలో మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణను కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. రూ.50 వేలకు మించి నగదు తరలింపుపై తప్పనిసరిగా లెక్క చూపాల్సి ఉంటుందని హెచ్చరించింది. మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా పార్టీ గుర్తుల ఆధారంగా జరుగుతాయని ప్రకటించారు. తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. స్థానిక పాలనపై ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఫిబ్రవరి 13 వరకు ఎదురుచూడాల్సిందే.