Nara Lokesh : నోరు పారేసుకుంటున్న నారా లోకేష్.! ఇదేం రాజకీయం.?
Nara Lokesh : ఆయన పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇలాగేనా మాట్లాడేది.? రాజకీయాల్లో నోరు పారేసుకుంటే, ప్రజలు హర్షిస్తారని అనుకోవడం అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. సీనియర్ పొలిటీషియన్, వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీద రుసరుసలాడారు నారా లోకేష్. నిజానికి నారా లోకేష్ వయసెంత.? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వయసెంత.? వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా.! ఇక, వైసీపీ కార్యకర్తల్ని పదే పదే పదే పదే ‘కుక్కలు’ అంటూ అభివర్ణించారు నారా లోకేష్. ఏ పార్టీ కార్యకర్తలైనాసరే, వాళ్ళంతా ప్రజలే కదా.. అన్న ఇంగితజ్ఞానాన్ని కోల్పోతే ఎలా.? అసలు ఇలాంటోళ్ళని రాజకీయాల్లో వుండనీయడమే తప్పన్న అభిప్రాయం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే వినిపిస్తోంది.
కుప్పంలో ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్బంగా గలాటా చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణుల్ని టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టాయి. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గొడవలకు కారణమైనవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో టీడీపీతోపాటు, వైసీపీకి చెందిన వారూ వున్నారు.టీడీపీకి చెందినవారిని కలిసేందుకు వచ్చిన నారా లోకేష్, ఇక్కడా నోరు పారేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ‘పిరికి ఫ్యాక్షనిస్టు’ అంటూ నిందారోపణలు చేశారు నారా లోకేష్. ఇంతేనా రాజకీయమంటే.? ఇలా రాజకీయాల్లో వ్యవహరిస్తే, ప్రజలు హర్షిస్తారని చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్‌కి రాజకీయ పాఠాలు చెప్పి వుంటారన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.
2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు నారా లోకేష్. మంత్రి అయి వుండీ నారా లోకేష్ ఓడిపోవడం శోచనీయం. అది ఆయన అసమర్థతగా చెబుతారు రాజకీయ విశ్లేషకులు. సరే, రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజల మన్ననలు పొందేలా రాజకీయాలు చేస్తే, 2024 ఎన్నికల్లో గెలిచే అవకాశం వుంటుంది. లేదూ, ఇలాగే నోరు పారేసుకుంటానంటే.. జనం ఇంటికి పంపించడం ఖాయం.!