Afghanistan : అమెరికాకి అప్పగించిన ఆప్ఘన్ పాప కనబడుటలేదు..?
Afghanistan : తాలిబన్ మూకల ఆక్రమణల వల్ల ఇబ్బందులు పడ్డ ఆప్ఘనిస్థాన్ ప్రజలు ఇక అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుని కాబుల్ ఎయిర్ పోర్టుకు పోటెత్తిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ఆప్ఘనిస్థాన్ దేశంలోని ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ భయభ్రాంతులకు గురై దేశం విడిచిపారిపోయారు.ఈ క్రమంలోనే కాబుల్ ఎయిర్ పోర్టులో విమానం రెక్కలపై నిలబడి ప్రయాణించాలనుకుని వెళ్లి.. ఏరోప్లేన్ టేకాఫ్ అయిన టైంలో అదుపు తప్పి కొందరు చనిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అలా విమానం రెక్కలపై ప్రయాణానికి సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి కూడా.
ఈ సందర్భంలోనే అమెరికా సైనికులు ఆప్ఘన్ దేశానికి చెందిన చిన్నారులను అక్కున చేర్చుకుని మానవత్వం చాటుకున్నారు. శరణార్థులను ఆదుకుంటున్న సందర్భంలో అగ్రరాజ్యం అమెరికా సైనికులకు రెండు నెలల వయసున్న చిన్నారిని చిన్నారి తండ్రి అప్పగించారు. అతడు ఎవరంటే.. కాబూల్‌లోని అమెరికా రాయబార ఆఫీసులో సెక్యురిటీ గార్డు. తన ఐదుగురు పిల్లలు, భార్యతో కలిసి దేశం విడిచివెళ్తున్న క్రమంలో రెండు నెలల వయసున్న చిన్నారిని ఆగస్టు 19న సైనికులకు అప్పగించాడు. ఆ పాప ఇప్పుడు కనిపించడం లేదన్న విషయం తెలుసుకుని చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ స్పందించడం లేదని చిన్నారి తండ్రి అలీ కన్నీటి పర్యంతమవుతున్నాడు. అలీ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో టెక్సాస్‌లోని ఆప్ఘన్ శరణార్థి శిబిరంలో ఉన్నాడు.
Afghanistan : చిన్నారులను అక్కున చేర్చుకున్న అమెరికా సైనికులు..
ఈ విషయమై వార్త వైరల్ కాగా, ఆప్ఘన్ శరణార్థుల బృందం సోషల్ మీడియాలో క్యాంపెయిన్ షురూ చేసింది. చిన్నారి సొహైల్ ఫొటోతో ‘మిస్సింగ్ బేబీ’ గ్రూపు సృష్టించి, బేబిని కనిపెట్టాలని కోరుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. అగ్రరాజ్య అమెరికా సైన్యం చిన్నారిని రక్షించలేకపోవడమేంటని పలువురు విమర్శిస్తున్నారు. ఇకపోతే అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు స్పందించారు. దురదృష్టవశాత్తు పాపను ఎవరూ కనుగొనలేకపోయారని పేర్కొన్నాడు.