Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా.! రాదు, రాదు గాక రాదు.!
Andhra Pradesh : కేంద్రంలో అధికారంలో వున్నవారికి మా పార్టీ అవసరం వచ్చినప్పుడు, ఖచ్చితంగా ప్రత్యేక హోదా డిమాండుని ముందు పెట్టి.. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాని తీసుకొస్తామని పదే పదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ, కేంద్రానికి సాయం అవసరమైన ప్రతిసారీ, బేషరతుగా ఆ సాయం చేసేస్తోంది. అలాంటప్పుడు, కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలా ఇస్తుంది.? ఇవ్వదుగాక ఇవ్వదు.!
ఒకప్పుడు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఎంపీలతోనూ రాజీనామా చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో చైతన్యం నింపారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కానీ, ఏం లాభం.? కేంద్రం దిగి రాలేదు. కేంద్రం దిగి రావాలంటే, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి సంపూర్ణ మెజార్టీ వుండకూడదు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ వున్న దరిమిలా, ఏం చేసినా.. రాష్ట్రం నుంచి వచ్చే డిమాండ్లను కేంద్రం నెరవేర్చదు.
అసలే తెలుగు నేల అంటే కేంద్రంలో ఎవరున్నా వారికి చిన్నచూపే. ఒక్కమాటలో చెప్పాలంటే, కేంద్రానిది సవతి ప్రేమే.. తెలుగు నేల పైన. ఇప్పుడూ అదే జరుగుతోంది. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయినప్పుడు, ఆ రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలి కదా.? కానీ, ఆదుకోవడంలేదు. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో ఇంకోసారి కేంద్రం స్పష్టత ఇచ్చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని. మళ్ళీ మళ్ళీ అదే మాట.! మోసపు మాట. మోడీ సర్కారు పడిపోతే తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేలా లేదు.