థియేటర్‌లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్ ఫుల్’
house full Bord cemeteries : హౌస్‌ఫుల్ బోర్డులు మనం ఇప్పటివరకు సినిమా థియేటర్లకే చూశాం.. కానీ ఇప్పుడు కరోనా కల్లోలంతో శ్మశాన వాటికలకు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి. భారతదేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. మొదటి వేవ్ లో కేవలం పట్టణాల్లో ప్రభావం చూపించిన కరోనా సెకండ్ వేవ్ లో పల్లెలకు కూడా వ్యాపించి మృత్యు జేగంటా మోగిస్తుంది. ఇక కర్నాటకలో మహమ్మారి కరోనా తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున కేసులు.. మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే 217 మరణాలు సంభవించాయి. ఆ రాష్ట్రంలో మరణాలు భారీగా చోటుచేసుకుంటుండడంతో శ్మశానాలన్నీ నిండుకుంటున్నాయి.
మృతదేహాలు భారీగా చేరుకుంటుండడంతో శ్మశానాలు కిటకిటలాడుతున్నాయి. కరోనాతో చనిపోయిన శవాలు భారీగా వస్తుండడంతో శ్మశాన వాటిక నిర్వాహకులు వాటికి అంత్యక్రియలు చేయలేకపోతున్నారు. ఖననం చేయడానికి శ్మశానాల్లో ఖాళీ ఉండడం లేదు. దీంతో బెంగళూరులోని పలు శ్మశానవాటికలు ‘హౌస్‌ఫుల్’ అనే బోర్డులు తగిలేస్తున్నాయి. చామ్‌రాజ్‌పేటలోని శ్మశాన వాటిక ‘హౌస్‌ఫుల్’ అనే బోర్డు తగిలేసింది.
కేవలం ఒక్క కర్ణాటకలోనే కాదు, దాదాపు దేశం లోని అన్ని శ్మశానల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అక్కడి కాటికాపర్లకు క్షణం తీరిక ఉండటం లేదు. కాటికాపర్లు కోసం గంటలు గంటలు వేసి చూడలేక కొన్ని చోట్ల చనిపోయిన వారి బంధువులే శవాన్ని కాల్చేస్తున్నారు. శ్మశానాలకు దగ్గరలో ఉండే పార్కులను ఖాళీ స్థలాలలో కూడా మృతులను కాల్చటానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఇలాంటి దారుణ సంఘటనలు జరుగుతుంటే రాబోయే మూడు నాలుగు వారాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే గుండెలు గుభేల్మంటున్నాయి.. ఈ మహమ్మారి నుండి భారత్ బయటపడాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ఇప్పటికే అనేక మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు..