దారుణం.. పురిటినొప్పులతో గర్భిణీ బాధపడుతుంటే.. అంబులెన్స్ ను ఆపేసి.. గర్భిణీని నడిపించారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

దారుణం.. పురిటినొప్పులతో గర్భిణీ బాధపడుతుంటే.. అంబులెన్స్ ను ఆపేసి.. గర్భిణీని నడిపించారు

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 May 2021,8:50 am

ఎంత దారుణం అంటే.. కరోనా వల్ల అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. అసలు మానవత్వం ఉన్నదా? అని అనిపిస్తుంది ఈ ఘటన గురించి తెలిస్తే. అసలే ఓ వైపు కరోనా మనల్ని పట్టి పీడిస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా కూడా మనుషులు ఇంకా మూఢనమ్మకాలను వదలడం లేదు. తమ ప్రాణాలను నిలబెట్టుకోవడం కోసం పక్క వాళ్ల ప్రాణాలను తీయడానికైనా సిద్ధపడుతున్నారు. ఏపీలో కూడా కరోనా భయం రోజురోజుకూ ఎక్కువవుతోంది. రోజుకు కనీసం 20 వేల వరకు కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

pregnant woman gives birth in ambulance in andhra pradesh

pregnant woman gives birth in ambulance in andhra pradesh

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నా… కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. మధ్యాహ్నం 12 నుంచి ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా… కరోనా మాత్రం అస్సలు తగ్గను అంటోంది. ముఖ్యంగా పల్లెల్లో కరోనా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ గ్రామస్థులే తమ గ్రామాల్లో పలు ఆంక్షలు విధించుకుంటున్నారు. బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి.. వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లను తమ గ్రామాల్లోకి అస్సలు రానివ్వడం లేదు.

చివరకు గర్భిణీ ఉన్న అంబులెన్స్ ను కూడా అడ్డుకున్నారు

ఎవరో సామాన్య ప్రజలను అడ్డుకున్నా పర్వాలేదు కానీ.. చివరకు అంబులెన్స్ ను కూడా తమ ఊళ్లో నుంచి వెళ్లనీయలేదు. విశాఖ ఏజెన్సీలోని పాల మామిడి గ్రామానికి అంబులెన్స్ రావడంతో… వెంటనే అంబులెన్స్ ను అడ్డుకున్నారు గ్రామస్థులు. నిజానికి ఆ అంబులెన్స్ వచ్చింది ఓ గర్భిణీ మహిళ కోసం. తనకు పురిటినొప్పులు ప్రారంభం కావడంతో.. అంబులెన్స్ కు ఫోన్ చేశారు కుటుంబ సభ్యులు. అయితే.. అంబులెన్స్ ఆ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు గ్రామంలోకి వెళ్తుండగా.. అంబులెన్స్ ను అడ్డుకున్నారు. కరోనా భయంతో అంబులెన్స్ ను అస్సలు గ్రామంలోకి అనుమతించలేదు. దీంతో ఆ మహిళ పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. ఎంత బతిమిలాడినా గ్రామస్థులు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. దీంతో తన పురిటినొప్పుల బాధ భరించలేక.. ఊరు శివారు వరకు ఆ గర్భిణీ నడుచుకుంటూ వెళ్లి.. ఆ తర్వాత అంబులెన్స్ ఎక్కింది. అయితే.. తను ఆ సమయంలో నడుచుకుంటూ వెళ్లడంతో పురిటినొప్పులు ఎక్కువై ఉమ్మునీరు కారి.. అంబులెన్స్ లోనే బాబుకు జన్మనిచ్చింది ఆ మహిళ. బాబు, ఆ మహిళ క్షేమంగానే ఉన్నారు కానీ.. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు ఎవరు బాధ్యులు అంటూ.. స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కరోనా భయం ఉంటే మాత్రం.. అంబులెన్స్ ను కూడా ఊళ్లోకి రానివ్వరా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది